న్యూఢిల్లీ: సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేపర్ లీకులకు వ్యతిరేకంగా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, ఝార్ఖండ్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమంలో మాత్రం పాల్గొనడం లేదు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించింది. ‘‘మీరు ఇప్పుడు ఝార్ఖండ్‌కు ఎందుకు వెళ్లడం లేదు?’’ అన్న ప్రశ్నకు దీప్కే స్పందిస్తూ.. ‘‘ఎందుకు సర్? నా బృందం ఇప్పటికే వెళ్లింది’’ అని సమాధానమిచ్చారు.
‘‘కానీ మీరు ఎప్పుడు వెళ్తారు? మీరే ఎందుకు వెళ్లడం లేదు?’’ అని మీడియా మళ్లీ ప్రశ్నించింది. దీప్కే స్పందిస్తూ.. ‘‘దృష్టి అంతా దేవేంద్ర మహతోపైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయనే నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు. నా గురించి నేను ప్రచారం చేసుకోవాలని అనుకోవడం లేదు’’ అని తెలిపారు.
కాగా, రాంచీ ఉద్యమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనల మధ్య దీప్కే ఇటీవల విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాహ్తోతో వీడియో కాల్‌లో మాట్లాడారు. రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని దీప్కే తెలిపారు.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ), ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్‌ఎస్‌సీ) నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా, భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కానన్లు వినియోగించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర మాహ్తో కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయనను రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు.


