సుదీర్ఘ విరామం తర్వాత భారత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి న్యూఢిల్లీ వేదికగా ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఇందుకు ఆగష్టు 17- 23 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించనుండగా.. కోతుల బెడద సమస్యగా మారింది.
కొండముచ్చుల మాదిరి
ఈ నేపథ్యంలో కోతులు స్టేడియంలోకి రాకుండా, వాటిని భయపెట్టేందుకు నిర్వాహకులు వింత పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమయ్యారు. కోతులను తరిమేందుకు కొండముచ్చుల మాదిరి అరుస్తూ, ఈలల వేసేందుకు ముగ్గురు మనుషులను నియమించారు.
నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు!
మరోవైపు.. ఇండియా ఓపెన్ సమయంలో పిట్టల రెట్టల కారణంగా పరిశుభ్రతకు సంబంధించి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో పావురాలు రెట్టలు వేశాయనే ఆరోపణలు వచ్చాయి. ఇక డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్‌ఫీల్డ్ అయితే.. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆడే పరిస్థితులు లేవని.. ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్మూ ధూళితో నిండిపోయానని మండిపడింది.
ఇప్పుడు అదే స్టేడియంలో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ నిర్వహించనుండగా.. మరోసారి పాత సంగతులు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలంపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఘాటుగా స్పందించింది.
కౌంటర్ ఇచ్చిన పీవీ సింధు
‘‘వందకు వంద శాతం. అసలు ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకైతే నిజంగా అర్థం కావడం లేదు. మన అందరికీ వింబుల్డన్ అంటే ఎంతో ఇష్టం. అక్కడ పావురాలను తరిమేందుకు రఫూస్‌ను ఉపయోగిస్తారు. చాలా ఏళ్లుగా అక్కడ ఇదే కొనసాగుతోంది.
ప్రతీ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌కు సంబంధించి స్థానికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ కొండముచ్చుల మాదిరి శబ్దాలు చేయడం అదనంగా తీసుకున్న ఒక చర్య. అంతకుమించి ఎన్నో మంచి సదుపాయాలు, ఏర్పాట్లు చేశారు.
భారత ఆతిథ్యం ఎలా ఉండబోతుందో ప్రపంచానికి తెలియబోతోంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ క్లాస్ ఆతిథ్యం ఉంటుందని నేను వంద శాతం నమ్ముతున్నా’’ అని పీవీ సింధు ఎక్స్ వేదికగా ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చింది.
వింబుల్డన్‌లో పావురాలను తరిమేందుకు
కాగా ఐకానిక్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 2000 సంవత్సరం నుంచి రఫూస్ (హ్యారిస్ హాక్) అనే పక్షి సేవల్ని వినియోగించుకుంటున్నారు. మ్యాచ్‌లు మొదలు కావడానికి ముందే ఇది పావురాలు, ఇతర పక్షులను తరిమికొడుతుంది. తద్వారా అంతరాయం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యమవుతుంది.
అయితే, రఫూస్ ఇతర పక్షులపై దాడి చేయదు. వాటిని వెంటాడదు. కానీ దీనిని చూస్తేనే చాలు మిగతా పక్షులు భయంతో అక్కడి నుంచి పారిపోతాయి. చాలా ఏళ్లుగా రఫూస్ వింబుల్డన్‌లో భాగమైపోయాడు. అభిమానుల ఫేవరెట్ మస్కట్‌గా మారిపోయాడు. అయితే, 2012లో రఫూస్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. అదృష్టవశాత్తూ వాడి జాడ దొరకడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: రొనాల్డోకు వేల కోట్ల ఆస్తి.. అతడి భార్య నెట్‌వర్త్ ఎంతంటే?


