ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా జార్జినా రోడ్రిగ్స్‌తో సహ జీవనం చేస్తున్న ఈ పోర్చుగల్ స్టార్.. తాజాగా ఆమెతో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. పెళ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ప్రకటించాడు.
జార్జినా చేతిలోన చెయ్యేసి పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రొనాల్డో పెళ్లి విషయాన్ని తెలియజేశాడు. ఇందులో ఇద్దరి వేళ్లకు వివాహ ఉంగరాలు ఉన్నాయి. కాగా రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుట్‌బాల్ దిగ్గజంగా ఎదిగిన అతడు.. ఫాలోయింగ్, సంపాదనలోనూ మిగిలిన అథ్లెట్ల కంటే ఎంతో ముందున్నాడు.
రొనాల్డోకు వేల కోట్ల ఆస్తి
వివిధ నివేదికల ప్రకారం.. రొనాల్డో నికర ఆస్తి విలువ పది- పన్నెండు వేల కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌స్టాలో అతడికి అత్యధికంగా 672 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ముందుగా రొనాల్డో పిల్లలకు తల్లిగా.. తాజాగా భార్యగా అతడి జీవితంలో చెరగని ముద్ర వేసిన జార్జినా రోడ్రిగ్స్ వృత్తి, ఆమె నికర ఆస్తి విలువ తదితర సంగతులు తెలుసుకుందామా?!
స్పానిష్ తల్లి, అర్జెంటినియన్ తండ్రికి జన్మించిన 32 ఏళ్ల జార్జినా.. స్పెయిన్‌లో పెరిగింది. క్యాథలిక్ స్కూల్‌లో చదివిన ఆమె చిన్ననాటి నుంచే బలెరినా డాన్సర్ కావాలని కలలు కన్నది. అయితే, మాడ్రిడ్‌కు మకాం మార్చిన తర్వాత ఆమె రాత కూడా మారిపోయింది.

సేల్స్ అసిస్టెంట్‌గా
మాడ్రిడ్‌లోని గూచి స్టోర్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే తొలిసారి 2016లో జార్జినా రొనాల్డోను కలిసింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వ్యక్తిగత కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టిన జార్జినా.. మోడల్‌గా రాణించింది. గూచి, ప్రడా, చానెల్ వంటి ప్రముఖ విలాసవంతమైన బ్రాండ్లతో కలిసి పనిచేసింది.
సంపాదనా మార్గాలు ఇవి
సోషల్ మీడియాలోనూ జార్జినాకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇన్‌స్టాలో ఆమెకు 77 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా తనదైన శైలిలో రాణిస్తూ ఇక్కడా సంపాదన మార్గాలను పెంచుకుంది. ఈ క్రమంలోనే వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది.
శిరోజ సౌందర్యాన్ని పరిరక్షించే క్లినిక్‌కు సహ వ్యవస్థాపకురాలిగా జార్జినా నిలిచింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్‌ను కూడా స్థాపించింది.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఐ యామ్ జార్జినా పేరిట రియాల్టి సిరీస్‌లోనూ ఆమె భాగమైంది. రొనాల్డో భాగస్వామిగా, అతడి పిల్లలకు తల్లిగా, యువ వ్యాపారవేత్తగా తన జీవితం ఎలా ఉంటుందో ఈ సిరీస్ ద్వారా జార్జినా ప్రేక్షకులకు చూపించింది.

నికర ఆస్తి ఎంతంటే?
ఈ క్రమంలో మోడలింగ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా కొలాబరేషన్లు, మీడియా, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా జార్జినా కూడా బాగానే సంపాదించింది. 2025 నివేదికల ప్రకారం జార్జినా నికర ఆస్తి విలువ వంద నుంచి నూట ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. కాగా రొనాల్డో భాగస్వామిగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న జార్జినా.. అధికారికంగా అతడి భార్యగా మారడంతో మరింత పాపులర్ అయింది.
చదవండి: ‘రొనాల్డోతో బ్రేకప్.. భారీగా డబ్బు ఆఫర్ చేశారు’


