జమ్మూ అండ్ కాశ్మీర్ మరో కీలక క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమైంది. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జమ్మూ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి.. జమ్మూ హెడ్ కోచ్ అజేయ్ శర్మ మాత్రం ధ్రువీకరించాడు.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు అతడు తెలిపాడు. షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధిపై స్ధానిక క్రికెట్ అసోసియేషన్‌కు దిశానిర్దేశం చేసేందుకు బీసీసీఐ ప్రతినిధుల బృందం ఇప్పటికే రెండుసార్లు శ్రీనగర్‌లో పర్యటించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 5,000గా ఉంది. కాగా షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం గతంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి.
శ్రీనగర్ వేదికగా 1983లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చివరగా 1986లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను ఈ గ్రౌండ్‌లో నిర్వహించారు. అయితే జమ్మూ-కాశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా చాన్నాళ్ల పాటు డొమాస్టిక్ మ్యాచ్‌లు సైతం నిర్వహించలేదు.
అయితే పరిస్థితులు కాస్త సద్దుమణగడంతో గతేడాది అక్టోబర్ 15-18 మధ్య శ్రీనగర్‌లోని ఈ స్టేడియంలో ముంబై, జమ్మూ కాశ్మీర్ మధ్య కీలక రంజీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది.
మళ్లీ ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో క్రికెట్ సందడి నెలకొంది. కాగా రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్మూ నిలిచిన సంగతి తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్‌కు ఇదే తొలి రంజీ టైటిల్ కావడం విశేషం. ఈ చారిత్రత్మక విజయంలో పేసర్ ఆకిబ్ నబీది కీలక పాత్ర. అతడు ప్రస్తుతం భారత జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.
చదవండి: IND vs SL: గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్


