‘ఆ పార్వతీ దేవి రూపమే.. మా బిడ్డగా జన్మించింది’ | Star Wrestler Babita Phogat Welcomes Baby Girl, Calls Her A Blessing From Goddess Parvati, Photo Went Viral | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భారత రెజ్లర్‌

Aug 12 2026 2:24 PM | Updated on Aug 12 2026 3:13 PM

Dangal Girl Babita Phogat Becomes Mother For Second Time

PC: Instagram

భారత స్టార్‌ రెజ్లర్‌ బబితా ఫొగట్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భర్త వివేక్‌ సుహాగ్‌తో కలిసి ఆడబిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానించింది. కాగా హర్యానాకు చెందిన ప్రముఖ రెజ్లింగ్‌ సిస్టర్స్‌లో బబితా ఒకరు. మహవీర్‌ ఫొగట్‌ కుమార్తెల్లో ఒకరైన ఆమె.. అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్‌గా సత్తా చాటింది.

కామన్‌వెల్త్‌ క్రీడల్లో బబితా ఫొగట్‌ మూడు పతకాలు సాధించింది. 2010లో రజతం గెలిచిన ఆమె.. 2014లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక 2018లో మరోసారి వెండి పతకంతో మెరిసింది. అదే విధంగా 2012 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌లోనూ బబిత కాంస్య పతకం అందుకుంది.

అంతేకాదు ఒలింపిక్స్‌లోనూ బబితా కుమారి పాల్గొంది. అయితే, కుస్తీకి స్వస్తి పలికిన తర్వాత ఆమె రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరి పార్టీకి సేవలు అందిస్తోంది.

ఇక బబితా కుమారి వ్యక్తిగత విషయానికొస్తే.. తోటి రెజ్లర్‌ వివేక్‌ సుహాగ్‌ను ప్రేమించిన బబిత 2019లో అతడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2021 జనవరిలో కుమారుడు జన్మించాడు. తాజాగా కుమార్తె కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని బబిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆ పార్వతీ దేవి రూపమే.. మా బిడ్డగా జన్మించింది
పాప పుట్టిన విషయాన్ని పంచుకుంటూ.. ‘‘ఆ మహాదేవుడి కృప వల్ల మాస శివరాత్రి రోజు నా జీవితంలోకి పార్వతీ దేవి వంటి చిన్నారి వచ్చింది. మా కుటుంబానికి దక్కిన విలువైన ఆశీర్వాదం. మా చిన్నారికి మీ దీవెనలు కావాలి’’ అని 36 ఏళ్ల బబితా ఫొగట్‌ బిడ్డతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. కాగా మహవీర్‌ ఫొగట్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్‌’ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాతో ఫొగట్‌ సిస్టర్స్‌కు దంగల్‌ సిస్టర్స్‌గా పేరు వచ్చింది. కాగా మహవీర్‌ ఫొగట్‌ తన నలుగురు కుమార్తెలతో పాటు తన సోదరుడి కుమార్తె వినేశ్‌ ఫొగట్‌ను సైతం మేటి రెజ్లర్‌గా తీర్చిదిద్దాడు. వినేశ్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరఫున హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement