PC: Instagram
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. చిరకాల ప్రేయసి, తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్‌ను అతడు అధికారికంగా వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అటు రొనాల్డో గానీ.. ఇటు జార్జినా గానీ ఇంత వరకు పెళ్లి విషయాన్ని ధ్రువీకరించలేదు.
అయితే, జార్జినా ఇటీవల తమ నిశ్చితార్థం జరిగిన విషయాన్ని మాత్రం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. రొనాల్డో పెళ్లి వార్తల వేళ అతడి మాజీ ప్రేయసి, ప్రముఖ ఇంగ్లిష్ నటి జెమ్మా అట్కిన్సన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారీగా డబ్బు ఆఫర్ చేశారు
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను, రొనాల్డో విడిపోయినప్పుడు చాలా మంది నాకు భారీగా డబ్బు ఆఫర్ చేశారు. అతడి గురించి చెడుగా చెప్పమని నన్ను బలవంతం చేశారు. అయితే, నేను మాత్రం ఆ ఆఫర్లను తిరస్కరించాను. ఎందుకంటే అతడి గురించి నెగటివ్‌గా చెప్పడానికి ఏమీ లేదు. నాకు ఆ అవసరం కూడా లేదు’’ అని జెమ్మా అట్కిన్సన్ పేర్కొంది.
ఐదుగురు పిల్లలకు తండ్రి
కాగా 2007లో కొన్ని నెలల పాటు రొనాల్డో, జెమ్మా డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పర గౌరవంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. పెళ్లి చేసుకోకుండానే రొనాల్డో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడు. 2010లో రొనాల్డో తన కుమారుడు జూనియర్ రొనాల్డోను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాడు.
అయితే, తన కుమారుడి తల్లి వివరాలు మాత్రం ఇప్పటికీ అతడు గోప్యంగానే ఉంచాడు. ఇక ఆ తర్వాత 2017లో సరోగసి ద్వారా రొనాల్డో కవలలు ఇవా మారియా, మేటియో రొనాల్డోకు జన్మనిచ్చాడు. వీరి తల్లి వివరాలు కూడా అందుబాటులో లేవు.

ఇక 2016 నుంచి తనతో కలిసి జీవిస్తున్న జార్జినాతో కలిసి 2017 నవంబరులో అలనా మార్టినాకు రొనాల్డో జన్మనిచ్చాడు. అనంతరం 2022లో ఈ జంటకు కవలలు బెల్లా ఎస్మెరల్డా, ఏంజెల్ జన్మించారు. అయితే, దురదృష్టవశాత్తూ ఏంజెల్ పుట్టిన కాసేపటికే కన్నుమూశాడు.
సంపన్న ఫుట్‌బాలర్
ఇదిలా ఉంటే.. ఫిఫా ప్రపంచకప్-2026లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శనతో నాకౌట్ దశలోనే నిష్క్రమించింది. దీంతో వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. ఇక రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.
ఇటు ఆట.. అటు ఎండార్స్‌మెంట్లు, వివిధ వ్యాపారాల ద్వారా అతడు రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తద్వారా అత్యంత సంపన్న ఫుట్‌బాలర్లలో ఒకడిగా రొనాల్డో కొనసాగుతున్నాడు. అతడి నికర ఆస్తి విలువ పదివేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా.


