Photo Credit: BCCI Twitter
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు కల్పించిన కైఫ్.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా స్పష్టంగా వివరించాడు. ధ్రువ్ జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగలడని, గాలే పిచ్ పరిస్థితులకు సర్ఫరాజ్ బ్యాటింగ్ శైలి సరిగ్గా నప్పుతుందని పేర్కొన్నాడు.
"ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రస్తుతం ఉన్న జట్టులో జురెల్‌కు అవకాశం కల్పిస్తారేమో. అతడు నిలకడ ప్రదర్శన చేయనప్పటికీ, ఇప్పటికే జురెల్ జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. కానీ నా దృష్టిలో మాత్రం ఐదు లేదా ఆరో స్థానంలో స్పిన్‌ను సమర్థంగా ఆడగల సత్తా సర్ఫరాజ్ ఖాన్‌కు ఉందని అనుకుంటున్నా.
సుదీర్ఘంగా సాగే టెస్టు ఫార్మాట్‌లో పిచ్ పరిస్థితులు అర్ధమయ్యేకొద్దీ సర్ఫరాజ్ రకరకాల షాట్లు ఆడుతూ తన శైలి బ్యాటింగ్ కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్‌ల్లో టెస్టుల్లో నాలుగు లేదా ఐదో రోజు వచ్చేసరికి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు.
అతనికి స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు, ఎక్స్‌ట్రా కవర్స్, బ్యాక్‌ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్‌లో ఆడగలడు. ఇక జురెల్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టి ఇటీవలి అతడి టెస్టు రికార్డు, ఫామ్ అంత గొప్పగా లేవనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.
ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 10 టెస్టులాడి 478 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆరు టెస్టుల్లో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.
కైఫ్ ప్లేయింగ్ ఎలెవెన్:
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్/ సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.


