రెండేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం
బరువు తగ్గి ఫిట్‌గా మారిన బ్యాటర్
అలుపెరుగని ప్రాక్టీస్‌తో ఆటకు సిద్ధం
ముంబై: ‘నేను తగినవాడినో కాదు తెలీదు, కానీ నా వద్ద ఉన్నవాటితోనే నేను పోరాడతాను’... ఈ వ్యాఖ్యతో తెలుగు సినిమా జెర్సీలో హీరో నాని ఫోటోను జత కలిపి మూడు రోజుల క్రితం సర్ఫరాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బహుశా భారత జట్టులో తనకు చాలా కాలంగా చోటు దక్కకపోవడంతో నిరాశను అతను ఈ రకంగా ప్రదర్శించినట్లున్నాడు. అయితే ఆదివారమే అతడిని శ్రీలంకతో సిరీస్ కోసం సెలక్టర్లు ఎంపిక చేశారు.
2024 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఇంతకాలం తర్వాత టీమ్‌లోకి పునరాగమనం చేశాడు. అయితే దీని వెనక కఠోర శ్రమ, పోరాటం ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధన కొనసాగించి అతను సిద్ధమైన తీరు సర్ఫరాజ్ ఆటపై ఆశలు రేపుతోంది. తాను ఆడిన 6 టెస్టుల్లో సర్ఫరాజ్ 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉండటం ఎలా చూసినా మెరుగైన ప్రదర్శనే.
అనూహ్యంగా దూరమై...
దాదాపు రెండేళ్ల క్రితం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత సర్ఫరాజ్ జట్టులో కోల్పోయాడు. నిజానికి ఈ మ్యాచ్ తొలి టెస్టులో అతను సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి రెండు టెస్టుల్లో కలిపి 21 పరుగులే చేశాడు. అయితే భారత్ 0–3తో చిత్తయిన ఈ సిరీస్‌లో ఇతర ఆటగాళ్లంతా కూడా విఫలమైనా వేటు సర్ఫరాజ్‌పైనే పడింది. ఆ తర్వాత పునరాగమనం చాలా కష్టంగా మారిపోయింది.
ఇంగ్లండ్ గడ్డపై భారత ‘ఎ’ జట్టు తరఫున 92 పరుగులు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్‌ను తీసుకోవాలని భావించినా... సెలక్టర్లు అంగీకరించలేదని సమాచారం. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ టీమిండియా పిలుపు దక్కింది.
17 కిలోల బరువు తగ్గి...
గత ఏడాదిన్నర కాలంలో సర్ఫరాజ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డాడు. ఈ క్రమంలో తన బరువు, ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలను సమాధానం ఇచ్చేందుకు అతను సన్నద్ధమయ్యాడు. రంజీ ట్రోఫీలో సుదీర్ఘ సమయం పాట క్రీజ్‌లో నిలిచి ట్రిపుల్ సెంచరీ సాధించినా... ఈ విషయంలో అతనిపై సందేహాలు తీరలేదు. దాంతో పట్టుదలగా ప్రయతి్నంచి ఏకంగా 17 కిలోల బరువు తగ్గించుకున్నాడు. దాంతో అతని శరీరం మరింత చురుగ్గా మారింది.
ముంబైలో ఎంసీఏ ఇండోర్ స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ వికెట్‌పై ప్రాక్టీస్ చేసిన అతను... కుర్లాలోని ప్రైవేట్ అకాడమీలో పూర్తిగా సిద్ధం చేయని ఎర్రమట్టి పిచ్‌లపై గంటల పాటు సాధన కొనసాగించాడు. స్పిన్ బౌలర్లను మరింతగా సమర్థంగా ఎదుర్కొనేందుకు అతను దీనిని అనుసరించాడు. అయితే వర్షాల కారణంగా ప్రాక్టీస్ సాధ్యం కాకపోవడంతో అతను కశ్మీర్‌కు వెళ్లిన తన సాధన కొనసాగించాడు. శ్రీనగర్ సమీపంలోని షేర్–ఎ–కశ్మీర్ స్టేడియంలో సర్ఫరాజ్ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లోనే నిలిచి తన ఆటకు పదును పెట్టాడు.
తుది జట్టులో పోటీ!
శ్రీలంకతో రెండు టెస్టులకు ప్రస్తుతం సర్ఫరాజ్ ఎంపికైనా... తుది జట్టులో స్థానం దక్కడం కూడా కీలకమే. భారత జట్టు తమ చివరి టెస్టు ఆడిన తుది జట్టు (అఫ్గానిస్తాన్‌తో)ను చూస్తే సాయి సుదర్శన్ ఆడిన మూడో స్థానానికి దేవ్‌దత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో మెరుగైన రికార్డు, ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో పాటు ఎడంచేతి వాటం కావడం అతని స్థానాన్ని దాదాపు ఖాయం చేశాయి. సర్ఫరాజ్ జట్టులో ఇప్పుడు ఆరో స్థానానికి పోటీ పడుతున్నాడు.
ఇప్పటి వరకు ఇక్కడ ఆడుతున్న ధ్రువ్ జురేల్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ జట్టులో ఉండగా రెగ్యులర్ బ్యాటర్‌గా జురేల్ స్థానం ప్రశ్నార్ధకమే. పైగా స్పిన్‌ను ఆడటంలో అతను పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ విషయంలో సర్ఫరాజ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాడు. ఒకవేళ తుది జట్టులో చాన్స్ లభిస్తే సత్తా చాటి తనను తాను నిరూపించుకోగల సామర్థ్యం సర్ఫరాజ్‌లో ఉందనేది వాస్తవం.


