ఏసీసీ ప్రీమియర్ కప్-2026 టోర్నీకి ముందు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వన్డే కెప్టెన్‌గా రోహిత్ పౌడెల్ స్థానంలో స్టార్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ సందీప్ లామిచానేను నియమించింది. ఈ విషయాన్ని సీఎఎన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా లామిచానే తొలుత 2022లో నేపాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
కానీ ఓ వివాదంలో చిక్కుకోవడంతో కెప్టెన్సీ అతడు కోల్పోయాడు. అతడి స్ధానంలో రోహిత్ పౌడెల్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించారు. నేపాల్ జట్టును రోహిత్ అద్భుతంగా నడిపించాడు. నేపాల్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 63 వన్డే మ్యాచుల్లో జట్టును నడిపించిన రోహిత్, 31 విజయాలు అందించాడు.
అయినప్పటికి తిరిగి లామిచానేను కెప్టెన్‌గా ఎంపిక చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లామిచానే కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ఏసీసీ ప్రీమియర్ కప్‌తో ప్రారంభించనున్నాడు. ఈ టోర్నీలో నేపాల్ జట్టు సెప్టెంబర్ 1న మలేషియాలోని బాయుమాస్ ఓవల్‌లో సౌదీ అరేబియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత గ్రూప్-ఎలోని బహ్రెయిన్, మలేషియా, హాంగ్‌కాంగ్‌లతో తలపడనుంది.
ఏసీసీ ప్రీమియర్ కప్ టోర్నీకి నేపాల్ జట్టు: సందీప్ లామిచానే (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అర్జున్ కుమాల్, రోహిత్ పౌడెల్, దేవ్ ఖనాల్, దీపేంద్ర సింగ్ ఐరీ, సుందీప్ జోరా, బాసిర్ అహ్మద్, ఇషాన్ పాండే, గుల్షన్ ఖా, షేర్ మల్లా, లలిత్ రాజ్‌బంశీ, కరన్ కేసీ, హేమంత్ ధామి.


