నిన్న (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో యంగ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలై, భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ టోర్నీ ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడటాన్ని, అందులోనూ పాక్ చేతిలో ఓడిపోవడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.
అంతవరకు తిరుగులేని శక్తిగా కనిపించిన భారత్.. అమీతుమీ పోరులో ఎందుకలా చతికిలబడిందని అంతా లెక్కలేసుకుంటున్నారు. కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. ఒత్తిడే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయినా యువ భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో ఒత్తిడికి చిత్తవడం ఇది కొత్తేమీ కాదు. గత ఎడిషన్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఇలానే చిత్తైంది.
స్టార్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఎందుకో యంగ్ ఇండియాకు ఫైనల్ ఫోబియా పట్టుకుంది. ఒత్తిడి మినహా కారణాలేమీ కనబడటం లేదు. ఎందుకంత ఒత్తిడా అన్ని పరిశీలిస్తే.. తాజా ఉదంతంలో (2025 ఎడిషన్ ఫైనల్లో) భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సమర్పించుకోవడం కారణంగా తెలుస్తుంది.
అలాగని బౌలింగ్ విభాగం బాగా లేదా అని చూస్తే అదీ లేదు. హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్ లాంటి సీనియర్ స్థాయి మీడియం పేసర్లు.. కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోవడం భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవడానికి కారణమని తెలుస్తుంది.
భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే టాస్ గెలిచినా పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడని టాక్ వినిపిస్తుంది. ఇదే భారత్ కొంపముంచిదని అనిపిస్తుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకున్నారు. ఓ దశలో పాక్ 400 స్కోర్ దాటేలా కనిపించినా 347 పరుగులకే పరిమితం చేయగలిగారు.
భారీ లక్ష్య ఛేదనను సైతం భారత్ ఆత్యవిశ్వాసంతోనే ప్రారంభించింది. తొలి బంతినే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్‌గా మలిచి పాక్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇక్కడే పాక్ బౌలర్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. భారత బ్యాటర్లను, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని బంతితో కట్టడి చేయలేమని తెలిసి నోటికి పని చెప్పారు.
పదేపదే కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీని మాటలతో, దురుసు ప్రవర్తనతో రెచ్చగొట్టారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన యంగ్ ఇండియా బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు పారేసుకొని పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత ఓటమి తొలి 10 ఓవర్లలోనే ఖరారైపోయింది. టాప్-5 ప్లేయర్లు 9.4 ఓవర్లలో 68 పరుగులకే ఔటైపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏదో ఆడాలని ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కునైనా దాటగలిగింది.
మొత్తంగా చూస్తే.. నిన్నటి రోజున భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పిచ్‌ను అంచనా వేయడం నుంచి పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ వలలో పడటం, అలాగే ఒత్తిడి లోనవడం వంటివి జరిగిపోయాయి. ఈ టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు అంతిమ పోరులో సత్తా చాటలేకపోవడం భారత ఓటమికి మరో కారణం.
గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా అదే విశ్వాసాన్ని తుది సమరంలో కొనసాగించలేకపోవడం ఇంకో కారణం. అంతిమంగా భారత్ అన్ని విధాల అర్హమైన ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ టోర్నీ చరిత్ర చూస్తే.. భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 12 ఎడిషన్లు జరగ్గా భారత్ 8 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చివరిగా 2021 ఎడిషన్‌లో టైటిల్ సాధించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.


