పాక్‌ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్‌ సూర్యవంశీ ఏం చేశాడంటే.. | Pakistan fans booing India U19 Players How Vaibhav Suryavanshi Reacted | Sakshi
Sakshi News home page

పాక్‌ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్‌ సూర్యవంశీ ఏం చేశాడంటే..

Dec 23 2025 5:09 PM | Updated on Dec 23 2025 6:13 PM

Pakistan fans booing India U19 Players How Vaibhav Suryavanshi Reacted

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్‌-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని టార్గెట్‌ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.

ఫైనల్లో పాక్‌ గెలుపు
ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ (యూత్‌ వన్డే)-2025 టోర్నమెంట్‌ దుబాయ్‌ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌.. గ్రూప్‌-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్‌ దశలో పాక్‌ను భారత్‌ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్‌ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.

ఇక ఆసియా కప్‌ అండర్‌-19 టైటిల్‌ను భారత్‌ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్‌ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ.. పాక్‌ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.

చిల్లర చేష్టలు.. వైభవ్‌ సూర్యవంశీ ఏం చేశాడంటే..
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత అండర్‌-19 ఆటగాళ్లు టీమ్‌ బస్‌ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్‌ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్‌ హుందాగా ప్రవర్తించడం విశేషం.

ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్‌ ఫ్యాన్స్‌ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్‌ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?
ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్‌-19 ఆసియా కప్‌ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్‌ ఎందుకు?

చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్‌ టోర్నీలో వైభవ్‌ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.

చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్‌ ఎవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement