‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్‌కు వెళ్తూనే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్‌ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్‌కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్‌ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్‌షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...!
సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్‌ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్‌లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్‌లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు.

అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం
14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.
నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు
ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్‌నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెపె్టన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోరీ్నలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది.
నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు
నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచి్చనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.

పిల్లలూ చదువును మరువొద్దు..
ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్‌తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది.


