ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్ ఎవరనే చర్చ వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్, డోనాల్డ్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాల పేర్లు ముందు వరుసలో ఉండటం సహజం. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్‌లీ.. బెస్ట్ బ్యాటర్, క్రికెటర్ ఎవరనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప బ్యాటర్ మరొకరు లేరని బ్రెట్ లీ స్పష్టం చేశాడు. కానీ గొప్ప క్రికెటర్ (Goat)అంటే మాత్రం తన దృష్టిలో జాక్వెస్ కల్లిస్ అని అతడు తెలిపాడు.
"అత్యుత్తమ బ్యాటర్ అంటే టెండూల్కర్ అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. కానీ గ్రేటస్ట్ ఆల్‌టైమ్ క్రికెటర్ అంటే మాత్రం జాక్వస్ కల్లిస్‌కే నా ఓటు. ఎందుకంటే ఆల్‌రౌండర్‌గా కల్లిస్ ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించాడు. అత్యుత్తమ గణాంకాలు అతడి సొంతం. జాక్ దారిదాపుల్లో ఎవరూ లేరు. అతడొక పరిపూర్ణ ఆల్‌రౌండర్" అని బ్రెట్‌లీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా సౌతాఫ్రికాకు చెందిన కల్లిస్ వరల్డ్ క్రికెట్ చరిత్రలో తనంకటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు.టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 10,000 కంటే ఎక్కువ పరుగులతో పాటు 250 పైగా వికెట్లు పడగొట్టిన ఏకైక ప్లేయర్ కల్లిస్ మాత్రమే.
టెస్టుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(23)లు గెలుచుకున్న రికార్డు కూడా కల్లిస్ పేరిట ఉంది. అంతేకాకుండా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో కల్లిస్(45) రెండో స్ధానంలో ఉన్నాడు. అతడు ఓవరాల్‌గా టెస్ట్, వన్డేల్లో కలిపి 25,000 కంటే ఎక్కువ పరుగులతో పాటు 570కి పైగా వికెట్లు సాధించాడు.
చదవండి: వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం!


