టీమిండియా స్టార్లకు షాక్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..! | ICC Announces Player Of The Month Nominees For July 2026 | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్లకు షాక్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

Aug 10 2026 4:29 PM | Updated on Aug 10 2026 4:33 PM

ICC Announces Player Of The Month Nominees For July 2026

source: ICC X

టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. ఐసీసీ జూలై నెల 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' నామినీస్‌లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌, బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ తంజిద్‌ హసన్‌ జూలై నెల పురుషుల నామినీస్‌ జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో భారత ఆటగాళ్లకు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లండ్‌ పర్యటనలో రాణించకపోవడమే.

హ్యారీ బ్రూక్‌.. భారత్‌పై దుమ్మురేపాడు
ఇంగ్లండ్‌ వైట్‌బాల్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ జూలైలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో విశేషంగా రాణించాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లండ్‌ భారత్‌పై వన్డే, టీ20 సిరీస్‌లను గెలుచుకుంది. భారత్‌పై వచ్చిన విజయాలు, వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బ్రూక్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రేసులో నిలబెట్టాయి.

జస్టిన్‌ గ్రీవ్స్‌.. బ్యాట్‌తో, బంతితో అదరగొట్టాడు
వెస్టిండీస్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ కూడా జూలై నెలలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో సెంచరీలు సాధించడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు. దీంతో ఒకే నెలలో బ్యాట్‌, బంతితో జట్టుకు కీలకంగా మారాడు. అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఐసీసీ అవార్డు నామినేషన్‌ దక్కేలా చేసింది.

బంగ్లాదేశ్‌ నుంచి తంజిద్‌ హసన్‌
బంగ్లాదేశ్‌ యువ బ్యాటర్‌ తంజిద్‌ హసన్‌ కూడా జూలై నెలలో వైట్‌బాల్‌ క్రికెట్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన తంజిద్‌.. జూలై నెలలో తన స్థాయిని మరోసారి చూపించాడు. దీంతో ఐసీసీ అతడిని కూడా ముగ్గురు నామినీల్లో చేర్చింది.

టీమిండియా స్టార్లకు ఎందుకు చోటు దక్కలేదు..?
జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. కానీ ఈ పర్యటనలో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో భారత్‌ టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో కోల్పోయింది.

వన్డే సిరీస్‌లో మాత్రం భారత్‌ మంచి ఆరంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించింది. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లలో భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ మాత్రమే ఓ వన్డే సెంచరీతో ఆకట్టుకున్నాడు.

మహిళల విభాగానికొస్తే.. శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ జూలై నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement