ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకప్పుడు ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్.. ఇప్పుడేమో ఒకే స్థానం కోసం కుస్తీ పడుతున్నారు.
2024 ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఇద్దరూ ఒకేసారి భారత టెస్ట్ క్యాప్ అందుకున్నారు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి జట్టులోకి రాగా.. రిషభ్ పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జురెల్‌కు అవకాశం దక్కింది.
అయితే అరంగేట్రం తర్వాత ఇద్దరి ప్రయాణం పూర్తిగా మారిపోయింది. సుమారు రెండేళ్ల తర్వాత సర్ఫరాజ్ ఆరు టెస్టులకే పరిమితం కాగా.. జురెల్ 10 టెస్టులు ఆడి భారత జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని సంపాదించాడు.
అయితే తాజాగా సమీకరణలు మారిపోయాయి. లంక టూర్‌కు తొలుత ఎంపికైన సాయి సుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇదివరకే జట్టులో ఉన్న జురెల్ వార్మప్ మ్యాచ్‌లో విఫలం కావడంతో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.
వార్మప్ మ్యాచ్‌లో వన్ డౌన్‌లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీతో తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా.. సర్ఫరాజ్ రాకతో జురెల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.
స్పెషలిస్ట్ వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ జట్టులో ఉన్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్ జురెల్‌కు అవకాశం ఇస్తుందో లేక స్పెషలిస్ట్ బ్యాటర్ అన్న కోణంలో సర్ఫరాజ్‌కు రీఎంట్రీ అవకాశం ఇస్తుందో చూడాలి. మొత్తానికి కలిసి అరంగేట్రం చేసిన ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది.
శ్రీలంకతో తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా)
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్


