Photo Credit: BCCI Twitter
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తు ఏంటనేది బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే చెప్పేశాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాము యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహించనున్నామని, షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లు గతంలో టీమిండియాకు విలువైన సేవలు అందించినప్పటికీ ఇప్పుడు అతడి సేవలు జట్టుకు అవసరం లేదని భావిస్తున్నట్లు అగార్కర్ పరోక్షంగా పేర్కొన్నాడు.
దీంతో షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి రిటైర్మెంట్‌కు సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తన్నాయి. అయితే బుమ్రా లాంటి టాప్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతుండడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనలోకి నెట్టేస్తుంది.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. షమీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంపిక కావడం లేదన్న నిరాశను పక్కనబెట్టి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తూనే ఉండాలని, షమీకి తానిచ్చే సలహా అదొక్కటేనని జహీర్ పేర్కొన్నాడు.
‘‘ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకోవాల్సింది షమీనే. మ్యాచ్‌లు ఆడుతూ బాగా రాణిస్తే జాతీయ జట్టుకు అందుబాటులో ఉన్నట్టే. ప్రస్తుతం జట్టు ఆలోచన మరోలా ఉండొచ్చు. కానీ ఆటగాడిగా మన ఆలోచన, మనం జట్టుకు ఎలా ఉపయోగపడగలమన్నది ముఖ్యం. షమీ ఇప్పుడు చేస్తున్నదే కొనసాగించాలి. మ్యాచ్‌లు ఆడటం, రాణించడమే చాలా ముఖ్యం’’ అని జహీర్ చెప్పాడు.
ఇక జస్‌ప్రీత్ బుమ్రా వరుస సిరీస్‌లకు ఫిట్‌గా ఉండకపోవడం, సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ కాపాడుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడడంపై స్పందించాడు.
"గాయాలు ఆటలో సహజం. అవి ప్రతి వ్యక్తి ప్రయాణంలో అంతర్భాగం. ఆటగాళ్ల పని భారం తగ్గించడం అవసరమే అయినా.. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ముఖ్యంగా పేసర్ గాయపడినప్పుడు లేదా కష్టమైన దశను ఎదుర్కొంటు న్నప్పుడు మన నియంత్రణలో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. గాయానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే వరకు ముందుకు సాగడం కష్టం" అని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
Read: బాడీ షేమింగ్‌పై ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!


