Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ నుంచి ఇప్పటికే వైదొలిగిన లండన్ స్పిరిట్, బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌పై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జో క్లార్క్ (42 బంతుల్లో 73) రాణించగా, ఆఖర్లో సీన్ డిక్సన్ (28 బంతుల్లో 51 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్) విధ్వంసం చేయడంతో బర్మింగ్‌హమ్ భారీ స్కోరు సాధించింది. లండన్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, హెన్రీ క్రొకొంబెలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లండన్ స్పిరిట్ 82 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (30 బంతుల్లో 66), డెవాల్డ్ బ్రెవిస్ (31 బంతుల్లో 55 నాటౌట్) విధ్వంసంతో లండన్ స్పిరిట్ ఈజీ విక్టరీ అందుకుంది. బర్మింగ్‌హమ్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్, సకిబ్ మహ్మూద్, టామ్ హెల్మ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
టోర్నీలో చివరి రెండు స్థానాల్లో ఉన్న లండన్ స్పిరిట్, బర్మింగ్ హమ్ ఫోనిక్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కాగా, ట్రెంట్ రాకెట్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టాప్‌లో నిలిచి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది.


