సిరాజ్‌ సిక్సర్ల జోరు | India wins over Sri Lanka Cricket XI in practice match | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ సిక్సర్ల జోరు

Aug 10 2026 3:47 AM | Updated on Aug 10 2026 3:47 AM

India wins over Sri Lanka Cricket XI in practice match

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్‌ ఎలెవెన్‌పై భారత్‌ విజయం

మెరిసిన గిల్, జైస్వాల్‌ 

ఈనెల 15 నుంచి తొలి టెస్టు

కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్‌ లభించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనుండగా... దానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) ఎలెవన్‌తో జరిగిన ఈ మూడు రోజుల పోరులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్‌క్లాస్‌ హోదా లేని ఈ మ్యాచ్‌లో చివరి రోజైన ఆదివారం ఇరు జట్లు చెరో 45 ఓవర్ల చొప్పున బ్యాటింగ్‌ చేశాయి. మొదట శ్రీలంక 45 ఓవర్లలో 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

నిషాన్‌ ఫెర్నాండో (73 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా ... భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, గుర్నూర్‌ బ్రార్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రధాన పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ చెరో వికెట్‌ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 6 పరుగులతో కలుపుకొని భారత జట్టు ముందు 207 పరుగుల లక్ష్యం నిలవగా... టీమిండియా 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలిచింది. 

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (46 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (44; 7 ఫోర్లు) చక్కటి షాట్‌లు ఆడాడు. రిషబ్‌ పంత్‌ (28; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురేల్‌ (17; 1 ఫోర్, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆఖర్లో సిరాజ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) భారీ సిక్స్‌లతో విరుచుకుపడి జట్టును గెలిపించడం విశేషం.  

సిరాజ్‌ సిక్స్‌ల ‘హ్యాట్రిక్‌’ 
కేవలం ప్రాక్టీస్‌ కోసమే జరిగిన మ్యాచ్‌ కావడంతో... జట్టు విజయం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 191/4తో నిలిచింది. భారత్‌ విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం. అప్పటికే ఒక సిక్స్‌ కొట్టి క్రీజులో ఉన్న సిరాజ్‌... కేషారా నువాంతా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి మూడు బంతులకు సిక్స్‌లు కొట్టడంతో భారత్‌ విజయం ఖరారైంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కావడంతో లంక జట్టు మిగిలిన రెండు బంతులు కూడా వేసి నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేసింది. 

సుదర్శన్‌ స్థానంలో సర్ఫరాజ్‌
గాయం కారణంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్‌ స్థానంలో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ భారత జట్టుకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్‌ టీమిండియా తరఫున 6 టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement