శ్రీలంక క్రికెట్ ఎలెవెన్ 363/8
నిషాన్, రవిందు, దినుషా అర్ధ సెంచరీలు
రెండేసి వికెట్లు తీసిన భారత స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, సుతార్
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా వామప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ పోరులో మన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మూడు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఎల్‌సీ ఎలెవన్ జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.
రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పసిండు సూర్యబండారా (35; 6 ఫోర్లు), పవన్ రత్నాయకే (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అహాన్ విక్రమసింఘే (31; 4 ఫోర్లు), రమేశ్ మెండిస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు మంచి స్కోరు సాధించింది.
ఓపెనర్లు నిషాన్, రవిందు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేశారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (13 ఓవర్లలో 0/44), ప్రసిధ్ కృష్ణ (8 ఓవర్లలో 0/32) పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... లంక ఓపెనర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. తొలి సెషన్ పూర్తిగా లంక ఆధిపత్యం సాగగా... రనౌట్ రూపంలో భారత్‌కు మొదటి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత కూడా ఎస్‌ఎల్‌సీ ఎలెవన్ జట్టు ఎక్కడా తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతీఒక్కరూ తమవంతు పరుగులు రాబట్టడంతో వాళ్ల ఇన్నింగ్స్ సాఫీగా సాగింది.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన భారత జట్టు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే లంకపై సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆడుతున్న ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోగా... స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా లేకపోవడంతో తొలి రోజంతా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ బ్యాటింగ్ చేయగా... శనివారం మనవాళ్లు బ్యాటింగ్ చేయనున్నారు. చివరిదైన మూడో రోజు ఆదివారం చెరో 45 ఓవర్లు ఆడనున్నారు.
గిల్‌కు గాయం
గాయం కారణంగా భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ వామప్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. గురువారం నెట్ ప్రాక్టీస్ సమయంలో గిల్ కుడి చేతి వేలికు గాయమైంది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతినిచ్చారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘గిల్ కుడి చేతి ఉంగరం వేలికి గాయమైంది. అందుకే వామప్ మ్యాచ్ తొలి రోజు అతడు మైదానంలోకి రాలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. గిల్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు’ అని బీసీసీఐ ‘ఎక్స్’లో పేర్కొంది. గిల్ పూర్తిగా కోలుకుంటేనే బ్యాటింగ్‌కు రానున్నాడు. లేకపోతే... ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న తొలి టెస్టులోనే నేరుగా బరిలోకి దిగుతాడు.


