విశ్లేషణ
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?
ఎందుకు రేర్?
పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.
ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్‌ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు.
ఎందుకంత ప్రాముఖ్యం?
ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్‌ఫోన్ , ఎల్‌ఈడీ టీవీ, ఇయర్‌బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్‌ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.
కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.
భారత్ ఏం చేయాలి?
భారత్‌లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్‌ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం.
అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.
కృష్ణ బాలాజి పల్లపోతు
వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు


