ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒకేరోజు రెండు పతకాలు
హైజంప్‌లో బసంత్‌కు రజతం
లాంగ్‌జంప్‌లో షానవాజ్‌కు కాంస్యం
యుజీన్ (అమెరికా): నాలుగు దశాబ్దాల చరిత్రగల ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడోసారి తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. ఆదివారం ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల హైజంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకం సాధించగా... పురుషుల లాంగ్‌జంప్‌లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం గెలిచిన సంగతి విదితమే. వెరసి ఈ మెగా ఈవెంట్‌లో భారత్ మొత్తం మూడు పతకాలు గెల్చుకుంది. 2021, 2022 ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లోనూ భారత్ మూడు పతకాల చొప్పున సాధించింది. ఆఖరిరోజు సోమవారం మహిళల హైజంప్ ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ పూజా సింగ్ బరిలో ఉంది. పూజా పతకం గెలిస్తే భారత్ తొలిసారి నాలుగు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుంది.
ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్‌గా ఉన్న 19 ఏళ్ల బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని సంపాదించాడు. తద్వారా ప్రపంచస్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ హైజంపర్‌గా బసంత్ గుర్తింపు పొందాడు. బసంత్ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం గెలిచిన యూనుస్ అయాచి (అల్జీరియా), కాంస్యం సాధించిన ఒటిస్ పూలే (బ్రిటన్) కూడా 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. ముగ్గురూ 2.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి సమఉజ్జీగా నిలిచారు.
యూనుస్ తొలి ప్రయత్నంలోనే 2.21 మీటర్లను అధిగమించగా... బసంత్ రెండో ప్రయత్నంలో... ఒటిస్ మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దాంతో యూనుస్‌కు స్వర్ణం ఖరారు చేయగా.. బసంత్‌కు రజతం, ఒటిస్‌కు కాంస్యం లభించాయి. రాజస్తాన్‌లోని గంగానగర్ జిల్లాకు చెందిన బసంత్ ప్రస్తుతం భారత నావికాదళంలో ఉద్యోగిగా ఉన్నాడు. బసంత్ తండ్రి గంగారాం డ్రైవర్‌గా, దినసరి కూలీగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఆసియా అండర్–20 చాంపియన్ అయిన షానవాజ్ ఖాన్ తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పతకంతో మెరిశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల షానవాజ్ 7.84 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. డేనియల్ లియోనారో ఇంజోలి (ఇటలీ; 7.97 మీటర్లు) స్వర్ణం... మేసన్ మెక్‌గ్రోడర్ (ఆస్ట్రేలియా; 7.96 మీటర్లు) రజతం గెలిచారు.
షానవాజ్ తండ్రి నసీముద్దీన్ టాక్సీ డ్రైవర్‌గా పని చేసేవారు. 2018లో ఆయన క్యాన్సర్‌తో చనిపోయారు. తండ్రి మృతి చెందాక షానవాజ్‌ను అతని బాబాయిలు, క్రీడాకారులైన షారుఖ్, మొహమ్మద్ హాదీస్ దిశానిర్దేశం చేశారు. షారుఖ్ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో జాతీయ చాంపియన్ కాగా, హాదీస్ మాజీ జావెలిన్ త్రోయర్. వీరిద్దరి స్ఫూర్తితో షానవాజ్ అథ్లెటిక్స్‌లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు.


