సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన | BCCI Names Sarfaraz Khan As Sai Sudharsan Replacement In India Squad For Sri Lanka Tests | Sakshi
Sakshi News home page

సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Aug 9 2026 8:47 PM | Updated on Aug 9 2026 8:47 PM

BCCI Names Sarfaraz Khan As Sai Sudharsan Replacement In India Squad For Sri Lanka Tests

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయి కుడి కాలివేలికి గాయం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్న సాయి.. జట్టుతో చేరేందుకు అవసరమైన ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందలేకపోయాడు. సాయి గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని బోర్డు వెల్లడించింది.

శ్రీలంకకు వెళ్లనున్న సర్ఫరాజ్
సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. అక్కడి నుంచి టీమిండియా గాలేకు వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.

సాయి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడంతో నంబర్‌ 3 స్థానం అతడికి దాదాపుగా ఖరారైపోయింది.

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు అప్‌డేటెడ్‌ టీమిండియా ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్

ఊహించని అవకాశం
దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్‌లోనే అతడు ఆకట్టుకున్నాడు. మూడు అర్ధ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు.

అదే ఏడాది బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత టెస్టు జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ భారత టెస్టు జట్టు నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.

ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 37.1గా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement