PC: CSA/SA20
నమీబియా పర్యటన నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ బిజోర్న్ ఫార్చూన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సౌతాఫ్రికాతో పాటు నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు మూడు జట్ల మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుంది. నమీబియా పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా తొలుత జింబాబ్వేతో కలిసి ట్రై సిరీస్‌లో ఆడనుంది.
అనంతరం నమీబియాతో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వైట్‌బాల్ కెప్టెన్లు తెంబా బవుమా (వన్డే), ఐడెన్ మార్క్రమ్ (టీ20)లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వీరితో పాటు కగిసో రబడ, లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్‌లకు కూడా రెస్ట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో 31 ఏళ్ల బిజోర్న్ ఫార్చూన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే.. స్టార్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ కవల సోదరుడు డువాన్ యాన్సెన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. తొలిసారి అతడు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
ఇక కార్బిన్ బాష్ సోదరుడు ఎథాన్‌కు తొలిసారి టీ20 జట్టులో చోటు దక్కడం మరో విశేషం. వీరితో పాటు కన్నోర్ ఎస్తెన్‌హూజెన్, నకొబాని మొకొయెనా కూడా తొలిసారి వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. హెర్మాన్ బ్రదర్స్ జోర్డాన్, రూబిన్‌లు కూడా జట్టులో చేరారు.
నమీబియా పర్యటనకు క్రికెట్ సౌతాఫ్రికా ఎంపిక చేసిన జట్టు
బిజోర్న్ ఫార్చూన్ (కెప్టెన్), ఈథన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, కన్నోర్ ఎస్తేర్‌హూజెన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, డువాన్ యాన్సెన్, క్వెనా మఫాక, నకోబని మొకొయెనా, నకబా పీటర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, లూథో సిపమ్లా, జేసన్ స్మిత్, ప్రెనేలన్ సుబ్రేయన్.
కాగా ఆగష్టు 28 నుంచి సెప్టెంబరు 13 వరకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు నమీబియాలో పర్యటించనుంది. ఆగష్టు 28- సెప్టెంబరు 6 వరకు ట్రై సిరీస్‌లో ఆడనున్న సౌతాఫ్రికా జట్టు.. సెప్టెంబరు 9, 11, 13 తేదీల్లో ఆతిథ్య నమీబియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ టూర్ మొత్తానికి విండ్‌హెక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ వేదిక.
చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత తుదిజట్టులో ఊహించని పేరు!


