PC: Instagram
భారత క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. బుల్లితెర నటి చార్లీ చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్లీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
కేకేఆర్ ఆల్‌రౌండర్‌గా..
ఈ క్రమంలో నూతన వధూవరులు రమన్‌దీప్ సింగ్- చార్లీ చౌహాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్‌లో 1997లో జన్మించిన రమణ్‌దీప్ సింగ్.. క్రికెట్‌పై మక్కువతో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 2022లో అరంగేట్రం చేశాడు.
ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న రమణ్‌దీప్ సింగ్.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 38 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 299 పరుగులు తీయడంతో పాటు.. ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ మీడియం పేసర్.
టీమిండియా తరఫున అరంగేట్రం
ఇక ఐపీఎల్‌లో సత్తా చాటిన రమణ్‌దీప్ సింగ్‌కు 2024లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం 15 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయగలిగాడు.
ఎవరీ చార్లీ చౌహాన్?
చార్లీ చౌహాన్ బుల్లితెర నటి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ సిరీస్‌లో ఏలా అనే పాత్రతో ఆమె గుర్తింపు పొందింది. ఆ తర్వాత కైసీ యే యారియాన్‌లో ముక్తి వర్ధన్ అనే పాత్ర పోషించింది. అదే ఎంటీవీ రోడీ సీజన్ 7లోనూ చార్లీ పాల్గొంది.
నటుడు కున్వార్ అమర్‌తో కలిసి నచ్ బలియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లోనూ చార్లీ భాగమైంది. గతంలో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇక యే హై ఆషికి 4 వంటి షార్ట్ ఫిలిమ్స్‌లోనూ చార్లీ నటించింది.
కేవలం నటనకే పరిమితం కాకుండా సంగీతం, రైటింగ్‌లోనూ చార్లీకి ప్రవేశం ఉంది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కి ఆమె రచయితగా పనిచేసింది. అయితే, రమణ్‌దీప్ సింగ్‌తో చార్లీ ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఎనిమిదేళ్లుగా మేము.. ఇప్పుడిలా.. శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాము’’ అని చార్లీ చౌహాన్ ఇచ్చిన క్యాప్షన్‌ను బట్టి ఇది నిజమని తేలింది.
చదవండి: మూడేళ్లుగా తిరుతుగున్నా... ప్లీజ్ సాయం చేయండి: పంత్


