రాహుల్‌కు వ్యతిరేకంగా ఎన్‌డీఏ ఎంపీల ఆందోళన
విపక్షాల తీరుపై ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్, చైర్మన్ అసంతృప్తి
లోక్‌సభ, రాజ్యసభల్లో నినాదాల హోరు
జార్ఖండ్ ఘటనపై పరస్పర ఆరోపణలతో ఉద్రిక్త వాతావరణం
పార్లమెంట్ ప్రాంగణంలో అధికార, విపక్ష కూటముల పోటాపోటీ నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దాదాపు నినాదాల హోరులో కొట్టుకుపోయాయి. ఇప్పటిదాకా లోక్‌సభలో 11 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం మినహా ఇతర కార్యక్రమాలేవీ సజావుగాసాగలేదు. రాజ్యసభలోనూ మంగళవారం ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. విద్యార్థులపై పోలీసుల దాడి అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం పేర్కొన్నా, పెల్లెట్ గన్స్ వినియోగంపై ఆదేశాలు ఎవరిచ్చారో స్పష్టంచేయాలని, ఇతర డిమాండ్లపై చర్చ జరగాలన్న విపక్షాల పట్టుదలతో పెద్దగా ఎలాంటి సభాకార్యకలాపాలు జరగకుండానే లోక్‌సభ బుధవారానికి వాయిదాపడింది.
చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పీకర్..
మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. అమిత్‌షా సభకు రావాలంటూ నినాదాలతో సభను అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టేందుకు అత్యంత ముఖ్యమైనదని స్పీకర్ ఓంబిర్లా అన్నారు. ‘‘సభ సవ్యంగా సాగకపోవడంతో నేనెంతో ఆవేదనకు గురవుతున్నా.
సభలో ప్లకార్డులు ప్రదర్శించే సంస్కృతికి విపక్షసభ్యులు ఇకనైనా ముగింపు పలకాలి’’అని అన్నారు. అయినాసరే సభలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సభ్యులు నినాదాలు, నిరసనలకంటే చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇరుపక్షాలు దీనిపై ఓ అవగాహనకు రావాలని కోరారు. అయినప్పటికీ అంతరాయాలు కొనసాగడంతో లోక్‌సభను వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షాల నిరసనలు కొనసాగడంతో సభాధ్యక్షుడు సభను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ వాగ్వాదం..
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల ప్రారంభంలోనే సభ్యుల నిరసనలతో కొంతసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించేందుకు అనుమతి లేదని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగించేందుకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్‌నుద్దేశించి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హోంమంత్రి ఒత్తిళ్లతో చైర్మన్ పనిచేస్తున్నారని అన్నారు. దీంతో చైర్మన్ స్పందించారు. ‘‘నాపై ఎవరి ఒత్తిడి లేదు. అందుకే ఎల్లప్పుడూ సభా మర్యాదలు, సభ్యుల బాధ్యతాయుతమైన వ్యవహారానికే ప్రాధాన్యం ఇస్తా’అని అన్నారు. ఈ సమయంలోనూ విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేయడంతో మొదట మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ వివిధ బిల్లులపై చర్చను కొనసాగించింది.
పోటాపోటీ ప్రదర్శనలు..
ఇరుసభల్లో వాదించుకునే అధికార, విపక్ష కూటమి సభ్యులు వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్ ప్రాంగణంలో పోటాపోటీ నిరసన ప్రదర్శనలతో బల ప్రదర్శనకు దిగారు. మకర ద్వారం ప్రాంతం ఇందుకు వేదికైంది. నీట్ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందా చోరీ, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనలను ప్రస్తావిస్తూ విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వీళ్లకు పోటీగా ఎన్‌డీఏ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ హయాంలో రాంచీలో పరీక్షార్థులపై లాఠీచార్జ్ చేశారని, ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనంవహిస్తున్నారంటూ అధికార కూటమి ఎంపీలు నిలదీశారు. సోరెన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతూ నిరసన ప్రదర్శన చేశారు.
జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ముకేశ్ దలాల్ వద్దకు ప్రియాంకా గాంధీ వెళ్లి మాట్లాడే ప్రయత్నంచేశారు. జార్ఖండ్‌లో విద్యార్థులను రాహుల్ గాంధీ కలిశారని ప్రియాంక చెప్పగా, ముకేశ్ దలాల్ మాత్రం ‘రాహుల్ గాంధీ జార్ఖండ్‌కు ఎప్పుడు వెళ్తారు?’అంటూ ప్రశ్నించారు. రాహుల్ ఇప్పటికే జార్ఖండ్ విద్యార్థులను కలిశారని ప్రియాంక స్పష్టంచేశారు. రాంచీలో విద్యార్థులను దారుణంగా కొట్టారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశ్నలు సంధిస్తూ నిరసనకు దిగారు. జార్ఖండ్ ఘటనతో పాటు పలు అంశాలపై కేంద్రం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కూడా కొందరు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రామమందిరం విరాళాలకు సంబంధించిన అంశాలను సైతం వారు ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరుపక్షాల ఎంపీల మధ్య తోపులాట వంటి ఘటనలు జరక్కుండా భద్రతాబలగాలు మధ్యలో
నిలబడ్డాయి.


