సాక్షి, బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కర్ణాటక ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి నా పేరును తొలగించారు’ అంటూ ఎస్‌ఐఆర్‌పై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వీడియో ద్వారా ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘నా స్నేహితులారా.. మీతో ఒక జోక్ పంచుకోవాలి.. ఎస్‌ఐఆర్ తర్వాత బెంగళూరులోని ఓటర్ల జాబితా నుంచి ఓటు హక్కును కోల్పోయిన 65 లక్షల మంది ఓటర్లలో నేనూ ఒకడిని.
నైస్ జోక్ కదా!!’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోనే తాను పుట్టి పెరిగానని, ఇక్కడే నివసించినట్లు, ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యనభ్యసించినట్లు, రంగభూమిలో కళాకారుడిగా అడుగులు వేసినట్లు, ఈ నియోజకవర్గం నుంచే లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల్లో కూడా పోటీ చేసినట్లు గుర్తుచేశారు. కాగా, బెంగళూరు సెంట్రల్‌లోని శాంతినగర శాసనసభ నియోజకవర్గంలో ప్రకాశ్ రాజ్‌కు ఓటు హక్కు ఉంది. అయితే ఆయన ఓటు హక్కు తొలగింపునకు శాశ్వత చిరునామా మార్పని (పర్మనెంట్లీ షిఫ్టెడ్) ఎన్నికల సంఘం తెలిపింది.


