శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లు శ్రీలంక టూర్ నుంచి తప్పుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో కీలక ఆటగాడు చేరాడు. ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సుందర్.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు మొదటి టెస్టుకు కాకపోయినా కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టు సమయానికైనా జట్టుతో కలుస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు వాషీ కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సిరీస్ మొత్తానికే అతడు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. వాషీ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని సీఓఈ భావిస్తున్నట్లు సమాచారం. లంక పర్యటనకు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా ఉన్నారు.
వాషీ స్ధానంలో మానవ్ లేదా సారాంశ్‌లలో ఎవరికో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. అదేవిధంగా బుమ్రా స్ధానంలో జమ్మూ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీ, సుదర్శన్ స్థానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కాగా తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది.
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్, మానవ్ సుతార్, నబీ, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సరాంశ్ జైన్.


