PC: BCCI
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 15) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత
ముఖ్యంగా సాయి సుదర్శన్ స్థానంలో అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
అదే ఏడాది చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌ను.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై మరింతగా దృష్టి పెట్టిన ఈ ముంబైకర్.. భారీగా బరువు తగ్గాడు. దేశీ క్రికెట్‌లోనూ రాణించి టీమిండియా నుంచి పిలుపు కోసం ఓపికగా ఎదురుచూశాడు.
తుదిజట్టులో కష్టమే
సాయి సుదర్శన్ గాయపడటంతో ఎట్టకేలకు సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించి.. శ్రీలంకతో తలపడే జట్టులో సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, తుదిజట్టులో అతడికి చోటు దక్కడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే ఉంది. సాయి సుదర్శన్ ఆడే మూడోస్థానానికి దేవదత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో సర్ఫరాజ్ ఆరో స్థానం కోసం చూస్తుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రూపంలో పోటీ ఉంది.
సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండి
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కిరణ్ మోరే కీలక వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ కంటే ధ్రువ్ జురెల్‌కే తుదిజట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు.
జురెల్ మంచి ఫీల్డర్ కూడా!.. సర్ఫరాజ్ రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చాడు. కాబట్టి అవకాశాల కోసం అతడు ఎదురుచూడాల్సిందే’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. పరోక్షంగా సర్ఫరాజ్‌ను కాదని.. జురెల్‌నే ఆడించాలని సూచించాడు. కాగా జురెల్ కంటే సర్ఫరాజ్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి.
ఆరు మ్యాచ్‌లలో కలిపి సర్ఫరాజ్ 37 సగటుతో పరుగులు రాబట్టగా.. జురెల్ సగటు 34. అంతేకాదు గత ఐదు మ్యాచ్‌లలో జురెల్ బాగా ఇబ్బందిపడ్డాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లోనూ జురెల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.


