Photo Credit: Twitter
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. జట్టులో ప్రధాన బౌలర్లకు రెస్ట్ ఇస్తారని భావించినప్పటికీ, దానిని కొట్టిపారేస్తూ ఆసీస్ జట్టు బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగనుంది. పేస్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌లను తొలి టెస్టులో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.
తుది జట్టు ఖరారు కాకపోయినప్పటికీ జట్టులోని ప్రధాన బౌలర్లను కొనసాగించాలని చూస్తోంది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ తమ స్థానాన్ని నిలుపుకోవాలంటే కష్టపడాల్సిందే. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దానిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
వచ్చే ఏడాదిలోగా ఆస్ట్రేలియా మరో 21 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కమిన్స్, హాజిల్‌వుడ్ లేనప్పటికీ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చెలరేగిందంటే దానికి ప్రధాన కారణం స్కాట్ బోలండ్. ఫామ్‌లో ఉన్నప్పటికీ హాజిల్‌వుడ్ కోసం బోలండ్‌ను తప్పించాల్సిన పరిస్థితి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎదురైంది.
ఇక జట్టులో ఏకైక స్పిన్నర్‌గా నాథన్ లియోన్ కీలకం కానున్నాడు. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నాథన్ లియోన్ పునరాగమనం ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌ను మరింత బలంగా మార్చింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్ రానుండగా, లబుషేన్, స్మిత్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ ఆడనున్నారు. కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బ్యూ వెబస్టర్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది.
ఇక 2003 తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడనుంది. చివరిసారి తలపడినప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. డార్విన్, కెయిర్న్స్ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ విజయాలతో బంగ్లాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, బో వెబ్‌స్టర్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్
సిరీస్ షెడ్యూల్:
మొదటి టెస్ట్: ఆగస్టు 13-17, డార్విన్
రెండవ టెస్ట్: ఆగస్టు 22-26, మెకే


