శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు | Andrew Flintoff Son-Rocky Hits-1st-Professional Century-For-Lancashire | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు

Aug 12 2026 7:42 AM | Updated on Aug 12 2026 8:28 AM

Andrew Flintoff Son-Rocky Hits-1st-Professional Century-For-Lancashire

ఇంగ్లండ్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. వ‌న్డే క‌ప్‌లో భాగంగా రాకీ ఫ్లింటాఫ్ అద్భుత శ‌త‌కంతో మెరిశాడు. 76 బంతుల్లోనే 123 ప‌రుగులు చేసిన రాకీ తండ్రి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ఇంగ్లండ్ జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ సెలెక్ట‌ర్ల‌కు సందేశాన్ని పంపించాడు. 

లంకాషైర్‌, సోమ‌ర్‌సెట్ మ‌ధ్య మ్యాచ్‌లో 65 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న రాకీ ఫ్లింటాఫ్, పనిలో పనిగా సీనియర్‌ జట్టు తరఫున మెయిడెన్‌ శ‌త‌కాన్ని నమోదు చేశాడు. మ్యాచ్ విష‌యానికొస్తే రాకీ ఫ్లింటాఫ్‌, కీట‌న్ జెన్నింగ్స్ విధ్వంసంతో సోమ‌ర్‌సెట్‌పై లంకాషైర్ 174 ప‌రుగుల రికార్డు విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 443 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 

ఓపెన‌ర్ కీట‌న్ జెన్నింగ్స్ (127 బంతుల్లో 156; 15 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), రాకీ ఫ్లింటాఫ్ (76 బంతుల్లో 123; 10 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో విధ్వంసం సృష్టించ‌గా, మాటీ హ‌స్ట్ (47), ఆఖ‌ర్లో జాక్ బ్లాథ‌ర్‌విక్ (10 బంతుల్లో 32 నాటౌట్‌) మెరుపుల‌తో లంకాషైర్ భారీ స్కోరు చేసింది. సోమ‌ర్‌సెట్ బౌల‌ర్ల‌లో మిగెల్ ప్రిటోరియ‌స్, ఆర్చీ వాగ‌న్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన సోమ‌ర్‌సెట్ 39.2 ఓవ‌ర్ల‌లో 269 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టామ్ లామ్మోబి (68) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, జోషువా థామ‌స్ (42), జోష్ షా (34) ప‌ర్వాలేద‌నిపించారు. భారీ టార్గెట్ ముందు ఉండ‌డంతో ఒత్తిడికి లోన‌య్యి సోమ‌ర్‌సెట్ పూర్తిగా త‌డ‌బ‌డింది. లంకాషైర్ బౌల‌ర్ల‌లో టామ్ అస్పిన్‌వాల్‌, జార్జ్ బాల్డ‌ర్‌స‌న్ చెరో 4 వికెట్లు తీశారు.

ఆండ్రూ ఫ్లింటాఫ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇంగ్లండ్ త‌ర‌ఫున స్టార్ ఆల్‌రౌండ‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఫ్లింటాఫ్ 1998 నుంచి 2009 మ‌ధ్య ఇంగ్లండ్  జాతీయ జ‌ట్టుకు ఆడాడు. వ‌న్డే, టెస్టుల్లో మేటి ఆల్‌రౌండ‌ర్‌గా పేరు పొందిన ఫ్లింటాఫ్ 79 టెస్టుల్లో 3,845 ప‌రుగులు, 226 వికెట్లు తీశాడు. ఇక 141 వ‌న్డేల్లో 3,394 ప‌రుగుల‌తో పాటు 169 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఫ్లింటాఫ్‌ అనగానే గుర్తొచ్చేది అదే..
మ‌న‌కు ఆండ్రూ ఫ్లింటాఫ్ అన‌గానే గుర్తుకొచ్చేది మాత్రం యువ‌రాజ్ ఆరు బంతుల్లో కొట్టిన‌ ఆరు సిక్స‌ర్లు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా యువ‌రాజ్ ఈ అద్భుతం న‌మోదు చేశాడు. త‌న చేష్ట‌ల‌తో రెచ్చ‌గొట్టిన‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు యువ‌రాజ్ త‌న బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు. అయితే ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని స్టువ‌ర్ట్ బ్రాడ్ వేసిన‌ త‌ర్వాతి ఓవ‌ర్లో చూపించాడు. ఆ ఓవ‌ర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్టిన యువ‌రాజ్ కోపానికి స్టువ‌ర్ట్ బ్రాడ్ బ‌లిప‌శువ‌య్యాడు.

చదవండి: హండ్రెడ్‌లో విధ్వంసం.. కివీస్ బ్యాట‌ర్‌ సిక్స‌ర్ల వ‌ర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement