శ్రీలంక మాజీ క్రికెటర్ మహరూఫ్ వ్యాఖ్య
సిరీస్ 1–1తో సమం కావొచ్చని జోస్యం
కోల్‌కతా: స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో... శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్‌లో గుర్నూర్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్... బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.
ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు ఓడిన టీమిండియా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం. కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అది భారత జట్టుకు అతి పెద్ద లోటు.

మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్‌లో బ్రార్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కావొచ్చు. అతడి బౌలింగ్‌లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది. దానితో ఫలితాలు రాబట్టవచ్చు. అతడిలో పోరాట పటిమ ఉంది... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్‌ది’ అని వెల్లడించాడు.
పంత్‌కు అరగంట చాలు..
ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్‌ను మూడో స్పిన్నర్‌గా బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు. ‘రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌కు అవకాశం దక్కొచ్చు. గాలె పిచ్ కుల్దీప్‌కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్‌లు కేవలం స్పిన్ మాత్రమే కావు... కాస్త బౌన్స్ కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో మానవ్‌కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది. రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్‌లతోనే బరిలోకి దిగొచ్చు.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి. అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి. స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీస్‌లో విజేతగా నిలుస్తారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు. నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో ‘డ్రా’ అవుతుంది’ అని మహరూఫ్ వివరించాడు.
బాడీలైన్ బౌలింగ్...
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పేస్‌తో ఆకట్టుకున్న గుర్నూర్... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు. ‘మీరు ప్రాక్టీస్ మ్యాచ్‌ను సరిగ్గా గమనిస్తే... బ్రార్ విభిన్న బంతులు వేశాడు. అవసరమైన సమయంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు. నేను భారత జట్టు సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవకాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని. అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు.
అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన నైపుణ్యం బ్రార్‌లో మెండుగా ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారవచ్చు’ అని మహరూఫ్ అన్నాడు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌పై వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రార్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌కు ఐపీఎల్‌లో పెద్దగా అనుభవం లేకపోయినా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గత నెలలో భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు.


