రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌ నిరాకరణ | Delhi High Court denies bail to wrestler Sushil Kumar | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌ నిరాకరణ

Aug 12 2026 3:45 AM | Updated on Aug 12 2026 3:45 AM

Delhi High Court denies bail to wrestler Sushil Kumar

న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్‌ పురుషైంద్ర కుమార్‌... సుశీల్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సుశీల్‌ కుమార్‌ను 2021లో యువ రెజ్లర్‌ సాగర్‌ హత్య కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఛత్రశాల్‌ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుశీల్‌ కుమార్‌ నుంచి తుపాకీ స్వాదీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలపరుస్తున్నాయని తెలిపింది. సుశీల్‌ కుమార్‌కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్‌ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది.  

కేసు ఏంటంటే... 
భూ వివాదాల నేపథ్యంలో జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ సాగర్‌ ధన్‌కర్‌ను 2021లో సుశీల్‌ కుమార్‌ తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం అతడిని ఛత్రశాల్‌ స్టేడియంకు తీసుకువచ్చి బేస్‌బాల్‌ బ్యాట్‌లు, హాకీ స్టిక్స్‌తో దారుణంగా కొట్టారు. దీంతో సాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్‌ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతేడాది బెయిల్‌ మీద బయటకు వచ్చిన సుశీల్‌ కుమార్‌ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement