బాబర్‌కు షాకిచ్చిన షాహిన్‌ ఆఫ్రిది! | Shaheen Afridi Break Silence On Babar Azam ODI Captaincy Return | Sakshi
Sakshi News home page

ఇప్పటికైతే నేనే కెప్టెన్‌.. బాబర్‌కు షాకిచ్చిన షాహిన్‌!

Aug 11 2026 5:38 PM | Updated on Aug 11 2026 5:59 PM

Shaheen Afridi Break Silence On Babar Azam ODI Captaincy Return

PC: ICC X

పాకిస్తాన్‌ క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా అనిశ్చితి కొనసాగుతోంది. ఆ జట్టు కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు తరచూ మారుతూ ఉంటారు. నాయకత్వ బృందంలో ఇలా నిలకడలేని కారణంగా ఇప్పటికే జట్టు ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. అయినప్పటికీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి షాన్‌ మసూద్‌ను తొలగించి.. తిరిగి బాబర్‌ ఆజంకే పగ్గాలు అప్పగించారు. త్వరలోనే వన్డే జట్టు సారథ్యం బాధ్యతలనూ తిరిగి బాబర్‌కే అప్పగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి 2022 టీ20 ప్రపంచకప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో వైఫల్యాల తర్వాత బాబర్‌ ఆజం స్వయంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో టెస్టులకు షాన్‌ మసూద్‌, వన్డేలకు మహ్మద్‌ రిజ్వాన్‌, టీ20 ఫార్మాట్‌కు సల్మాన్‌ ఆఘా సారథులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వన్డేల్లో రిజ్వాన్‌ను షాహిన్‌, తాజాగా టెస్టుల్లో మసూద్‌ను బాబర్‌ రీప్లేస్‌ చేశారు.

ఇక వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి సమయం దగ్గరపడుతున్న వేళ యాజమాన్యం సారథిగా మరోసారి బాబర్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడే వన్డే పగ్గాలు అప్పగించాలని బాబర్‌ షరతు విధించినట్లు టెలికామ్‌ ఆసియా స్పోర్ట్‌ ఇటీవల తన కథనంలో పేర్కొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వన్డే కెప్టెన్‌ మార్పు గురించి షాహిద్‌ ఆఫ్రిదికి తాజాగా ప్రశ్న ఎదురైంది. నేషనల్‌ చాంపియన్‌షిప్స్‌ 2026 ఆరంభం సందర్భంగా ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పటి వరకైతే నేనే వన్డే కెప్టెన్‌’’ అని షాహిన్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. దీనిని బట్టి తన పదవి ఎప్పుడైనా ఊడిపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు.

కాగా 2025లో షాహిన్‌ ఆఫ్రిది వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడి సారథ్యంలో ఇప్పటికి 11 వన్డేలు ఆడిన పాకిస్తాన్‌.. ఏడింట గెలిచి.. నాలుగు ఓడింది. తద్వారా అతడి విజయాల శాతం 63.63గా నమోదైంది. మరోవైపు.. బాబర్‌ ఆజం కెప్టెన్‌గా 43 వన్డేలు ఆడగా.. ఇందులో 26 గెలిచి.. 16 ఓడిపోయాడు.

ఇక బాబర్‌ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్‌ 85 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 48 గెలిచి.. 38 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇటీవల టెస్టు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన బాబర్‌ వెస్టిండీస్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement