ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ పోర్చుగల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్-2028 యూరోప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్ ‘సి’లో భాగంగా నాయకుడిగా జట్టును ముందుకు నడిపించనున్నాడు. పోర్చుగల్ క్రికెట్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది.
కాగా పోర్చుగల్‌లో జన్మించిన మోజెస్ హెన్రిక్స్ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడే క్రికెటర్‌గా ఓనమాలు నేర్చుకుని.. దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున 2006లో అరంగేట్రం చేశాడు.
వేల పరుగులు.. వందల వికెట్లు
మొత్తంగా 131 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్-ఎ మ్యాచ్‌లు. 301 టీ20 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ ఆయా ఫార్మాట్లలో 6830, 3812, 5747 పరుగులు సాధించాడు. ఈ మీడియం పేసర్ మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 333 వికెట్లు పడగొట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో 3324 రన్స్ చేశాడు హెన్రిక్స్. కెప్టెన్‌గా సిడ్నీ సిక్సర్స్‌కు 2019, 2020 సీజన్లలో వరుస టైటిళ్లు అందించాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 2009లో అడుగుపెట్టిన మోజెస్ హెన్రిక్స్.. మొత్తంగా ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 164, వన్డేల్లో 117, టీ20 ఫార్మాట్లో 355 పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఎనిమిది, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు.
షెడ్యూల్ ఇదే
ఇక 2021లో ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన మోజెస్ హెన్రిక్స్ ఇటీవలే ఆసీస్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. తాజాగా పుట్టిన దేశం పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఆగష్టు 14న ఇజ్రాయెల్, ఆగష్టు 15న జర్మనీ, ఆగష్టు 17న గ్రీస్, ఆగష్టు 20న చెజియాతో పోర్చుగల్ తలపడుతుంది. ఇదిలా ఉంటే.. హెన్రిక్స్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2028 క్వాలిఫయర్స్‌కు పోర్చుగల్ జట్టు
మోజెస్ హెన్రిక్స్ (కెప్టెన్), క్రెయిగ్ కచోపా, ఎడ్వర్డ్ ఫ్లెమింగ్, క్రిస్టోఫర్ డే ఫ్రెయిటాస్, రాహుల్‌కుమార్ హషూ, సిరాజ్ ఉల్లా ఖదీం, హర్దీప్ ఖట్టాన్, జెరెమీ మార్టిన్‌స, ధవళ్‌కుమార్ నొరోటామ్ (వికెట్ కీపర్), జోర్డాన్ నెట్టో, కార్లోస్ నూన్స్, సెబాస్టియన్ డి ఒలివెరా, ఉపేన్ శాంతూ, కామెరాన్ షెక్లెటన్.
చదవండి: సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్!.. యాన్సెన్ కవల సోదరుడికి ఛాన్స్


