అప్పట్లో ఈ దేశాన్ని చూసి అసూయపడిన ప్రపంచం.. ఇప్పుడు జాలి.. | Australia Economic Miracle Turns Into a Nightmare What Went Wrong | Sakshi
Sakshi News home page

అప్పట్లో ఈ దేశాన్ని చూసి అసూయపడిన ప్రపంచం.. ఇప్పుడు జాలి..

Aug 10 2026 6:44 PM | Updated on Aug 10 2026 7:26 PM

Australia Economic Miracle Turns Into a Nightmare What Went Wrong

పాశ్చాత్య దేశాలన్నీ ఆర్థిక సంక్షోభాలతో అల్లాడిపోతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం అప్పట్లో ఏటా ఎదురులేకుండా దూసుకుపోతూ ప్రపంచానికి సిసలైన 'లక్కీ కంట్రీ' అనిపించుకుంది. ఎటు చూసినా ఇనుము, బంగారం, లిథియం వంటి అపారమైన సహజ వనరులు.. మరోవైపు తిరుగులేని దేశీయ మార్కెట్.. ఇవన్నీ కలిసి ఆస్ట్రేలియాను దశాబ్దాల పాటు ఆర్థిక మాంద్యం ఛాయలేకండా కాపాడుతూ వచ్చాయి. 

ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఏకంగా మూడు దశాబ్దాల పాటు క్షణం తీరికలేకుండా నిరంతర వృద్ధిని సాధించిన ఈ అగ్రగామి దేశం కొవిడ్ మహమ్మారి తర్వాత ఒక్కసారిగా కుదేలయింది. ఒకప్పుడు ప్రపంచ సంపదలో టాప్‌లో నిలిచిన ఆస్ట్రేలియా పౌరులు, ఇప్పుడు ద్రవ్యోల్బణం దెబ్బకు, జీడీపీ పడిపోవడంతో గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా లబోదిబోమంటున్నారు. అసలు దశాబ్దాల పాటు ఎదురులేకుండా సాగిన ఈ సౌభాగ్య దేశంలో ఇంతటి దుస్థితికి అసలు కారణం ఏంటి?

ఏప్రిల్ 2020కి ముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నిరంతరం వృద్ధి సాధించి 'లక్కీ కంట్రీ' (Lucky Country) గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలన్నిటికీ అసూయ కలిగించేలా ఉన్న ఆస్ట్రేలియా ఎకానమీ.. కొవిడ్ మహమ్మారి తర్వాత తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. జనాభా వృద్ధిని మినహాయిస్తే తలసరి జీడీపీ (GDP per capita) పడిపోవడం, ద్రవ్యోల్బణం (Inflation) అంతుచిక్కకుండా పెరగడం, ఉత్పాదకత దెబ్బతినడంతో ఆస్ట్రేలియా ప్రజల్లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న ఈ ప్రశ్నకు అసలు సమాధానం చాలా మంది ఊహించినదాని కంటే ఎంతో సరళమైనదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సౌభాగ్యం నుంచి స్తబ్దత వైపు..
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ గతంలో ఇంత బలంగా ఉండటానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి.. ఇనుము, బొగ్గు, ఆయిల్, బంగారం, లిథియం వంటి అపారమైన సహజ వనరులు ఉండటం, వాటిని చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా ఎగుమతి చేయడం. రెండు.. కేవలం ఎగుమతుల మీదే కాకుండా అత్యుత్తమ విద్య, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సేవలతో కూడిన పటిష్ఠమైన దేశీయ ఆర్థిక మార్కెట్ ఉండటం. ఈ కారణంగానే ఆస్ట్రేలియా పౌరుల సగటు సంపద ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచింది. కానీ, మహమ్మారి తర్వాత ఈ విజయాల జోరుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కనిపిస్తున్న నామమాత్రపు జీడీపీ వృద్ధి కేవలం వలసల (Immigration) వల్ల మాత్రమే వస్తోందని, వాస్తవానికి కార్మికుల పనిగంటలు పెరిగినప్పటికీ ఉత్పాదకత (Productivity) పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల వాస్తవ వేతనాలు (Real Wages) సుమారు 5 శాతం వరకు క్షీణించాయి.

అంతర్గత సమస్యనా?
అమెరికా టారిఫ్‌ విధానాలు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం, చైనా స్వీయ-సమృద్ధి విధానాల కారణంగా ఆస్ట్రేలియా ఎగుమతులు 2023 నాటికి గరిష్ఠ స్థాయికి చేరి క్షీణించడం వంటి భౌగోళిక రాజకీయ కారణాలు (Geopolitics) కూడా ఆస్ట్రేలియాను కొంతవరకు ప్రభావితం చేశాయి. అయితే, వీటన్నింటికంటే ప్రధాన సమస్య పూర్తిగా వేరే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే.. దేశంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు క్రమంగా తగ్గిపోవడం! 2013 నుంచి ఆస్ట్రేలియాలో ప్రైవేట్ పెట్టుబడులు సుమారు 25 శాతం వరకు పడిపోయాయి. గనుల రంగాన్ని మినహాయించి చూస్తే, మిగతా ఆర్థిక రంగంలో పెట్టుబడులు జీడీపీలో 14% నుంచి 10%కి కుచించుకుపోయాయి. ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే ఆస్ట్రేలియాలో ఈ పెట్టుబడుల అంతరం అత్యంత ఎక్కువగా ఉంది.

హౌసింగ్ రంగంపైనే సర్వస్వం.. అసలు సమస్య ఇక్కడే!
ఆస్ట్రేలియాలో వ్యాపారాలు అంతగా పెట్టుబడులు పెట్టకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గతంలో సాధించిన విజయాలతో కంపెనీలు విశ్రాంతి భావంలో ఉండిపోవడం. రెండవది, అత్యంత కీలకమైన నిర్మాణాత్మక సమస్య.. అక్కడి బ్యాంకులు వ్యాపారాల కంటే రియల్ ఎస్టేట్  హౌసింగ్ పెట్టుబడులకే అధికంగా రుణాలు కేటాయించడం! ఒక బ్యాంకింగ్ వ్యవస్థ హౌసింగ్‌కు ఎక్కువ అప్పులు ఇస్తే, ఆటోమేటిక్‌గా వ్యాపారాలకు అందే క్రెడిట్ తగ్గిపోతుంది. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, గృహ యజమానులతో పాటు బ్యాంకులు, వ్యాపార సంస్థలు కూడా తమ వద్ద ఉన్న డబ్బునంతా ప్రాపర్టీల మీదే కుమ్మరించాయి.

ఈ భారీ పెట్టుబడుల కొరతే ఆస్ట్రేలియా ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీసింది. సరైన పరికరాలు, పెట్టుబడులు లేకపోవడం వల్ల కార్మికుల ఉత్పాదకత పడిపోయింది. ఉత్పత్తి తగ్గి, ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రసరణ పెరగడంతో ద్రవ్యోల్బణం అంతుచిక్కకుండా పేరుకుపోయింది. ఇదంతా చూస్తుంటే, ఆకాశాన్ని తాకే ఇళ్ల ధరలు కేవలం ఇల్లు కొనాలనుకునే తొలిసారి కొనుగోలుదారులకే కాకుండా, సమగ్ర దేశ ఆర్థిక వ్యవస్థకే ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

-సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement