పెరగని గ్రామీణుల ఆదాయం | Cost of living crisis due to rising inflation | Sakshi
Sakshi News home page

పెరగని గ్రామీణుల ఆదాయం

Aug 6 2026 4:39 AM | Updated on Aug 6 2026 4:39 AM

Cost of living crisis due to rising inflation

ఆదాయంలో మూడింట రెండు వంతులు రోజువారీ ఖర్చులకే సరి 

క్షీణించిన 20% కుటుంబాల ఆదాయం 

పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జీవన వ్యయ సంక్షోభం 

నాబార్డ్‌ తాజా సర్వేలో వెల్లడి

దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) తాజా సర్వే స్పష్టం చేసింది. నాబార్డ్‌ ఈ ఏడాది జూన్‌–జూలై నెలల్లో ‘రూరల్‌ ఎకనామిక్‌ కండిషన్స్‌ అండ్‌ సెంటిమెంట్స్‌ సర్వే’పేరిట సర్వే చేసింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే దేశంలో సగానికి పైగా (53 శాతం) గ్రామీణ కుటుంబాల ఆదాయంలో ఎలాంటి పెరుగుదలా లేదు. అంతేకాదు, మరో 20 శాతం కుటుంబాల ఆదాయం పూర్వంతో పోలిస్తే మరింత క్షీణించింది. కేవలం 28 శాతం మంది మాత్రమే తమ ఆదాయం పెరిగిందన్నారు. నాబార్డ్‌ చేసిన సర్వేలన్నిటిలోనూ ఆదాయం పెరిగిన వారి శాతం ఇంత తక్కువగా గతంలో ఎప్పుడూ లేకపోవటం ఒక ఆందోళనకరమైన పరిణామం.  

పెరుగుతున్న రోజువారీ ఖర్చులు 
ఒకవైపు ఆదాయాలు స్తంభించిపోగా, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం గ్రామీణులను తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి గ్రామీణ కుటుంబం తమ నెలవారీ సంపాదనలో దాదాపు మూడింట రెండొంతులు (సుమారు 66 శాతం) కేవలం కుటుంబ పోషణ, నిత్యావసర ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. దాదాపు 74 శాతం కుటుంబాలు తమ రోజువారీ ఖర్చులు బాగా పెరిగాయని తెలిపాయి. దీనివల్ల పొదుపు చేసుకునే అవకాశం లేక, గ్రామీణ కుటుంబాలు తీవ్ర జీవన వ్యయ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. 

ప్రభుత్వ సబ్సిడీలలోనూ తగ్గుదల 
గ్రామీణ ప్రాంతవాసులకు కొంత ఊరటనిచ్చే ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల నిధుల వాటా కూడా పడిపోయింది. 2025 జనవరిలో గ్రామీణ కుటుంబ సగటు ఆదాయంలో ప్రభుత్వ సహాయం వాటా 10 శాతం ఉండగా, అది 8 శాతా నికి తగ్గిందని నాబార్డ్‌ పేర్కొంది. లబ్ధిదారుల ‘క్రమబద్ధీకరణ’ఇందుకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 

భవిష్యత్తుపై ఆందోళన 
ఎల్‌నినో నేపథ్యంలో వర్షపాతంలో అనిశ్చితి, పెరిగిన సాగు ఖర్చులు, ఆశించిన స్థాయిలో రాబడి లేకపోవడంతో రాబోయే ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించవచ్చని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఉపాధిని దెబ్బతీస్తున్న ఈ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ, గ్రామీణ రంగాలకు ప్రత్యేక ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.  

–సాక్షి, స్పెషల్‌ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement