ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్‌’! | Experts say that AI psychosis is a mental disorder | Sakshi
Sakshi News home page

ఇదో కొత్త చికాకు... ‘ఏఐ సైకోసిస్‌’!

Aug 6 2026 4:34 AM | Updated on Aug 6 2026 4:34 AM

Experts say that AI psychosis is a mental disorder

ఏఐ చాట్‌బాట్‌లలో మునిగితే నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించలేరు 

ఏఐ తనకే దైవిక లేదా రహస్య సందేశాలు ఇస్తోందని నమ్మే భ్రమని కలిగిస్తుంది

ఏఐ సైకోసిస్‌ అనేది ఓ మానసిక రుగ్మత అంటున్న నిపుణులు

వైద్యపరంగా అధికారికంగా దీనిని జబ్బుగా గుర్తించకపోయినా తీవ్ర సమస్యగా పరిగణన

సాక్షి, హైదరాబాద్‌: ఏఐ సైకోసిస్‌.. ఇది కొత్తగా వచ్చిన ఓ మానసిక రుగ్మత. ఏఐ చాట్‌బాట్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మానసిక సమస్యలున్న వారు లేదా దుర్బలమైన మనస్తత్వం ఉన్న వారు నిజం, అబద్ధం మధ్య తేడాను గుర్తించలేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా... ఏఐ తమకు మాత్రమే నిజమైన, దైవిక లేదా రహస్య సందేశాలు ఇస్తోందని నమ్మే భ్రమని యూజర్లలో కలిగిస్తుంది. 

ఏఐ చాట్‌బాట్‌లు యూజర్లు చెప్పేదానికి ఎక్కువగా తల ఊపుతూ, వాటిని నిజమేనని (సైకోఫాన్సీ) సమర్థిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏఐకి ప్రాణం ఉందని, అది సజీవంగా ఉందని భ్రమిస్తారు. ఒంటరిగా ఉన్న వారు ఏఐతో మితిమీరిన స్నేహం లేదా ప్రేమలో పడి, నిజమైన మానవ సంబంధాలను దూరం చేసుకోవడంతోపాటు తీవ్రస్థాయిలో భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలుంటాయి.

భ్రమలు – నమ్మకాలు
బ్రిటన్, అమెరికాతోపాటు పలు దేశాల్లో పలువురు వ్యక్తులు తమ ఏఐ సహచరుడు తమకు ప్రత్యేకమైన దైవిక శక్తులు ఇచ్చాడని లేదా ప్రపంచ రహస్యాలను ఛేదించే మిషన్‌ అప్పగించాడని నమ్మినట్లు పరిశోధకులు గుర్తించారు. యూకేలో ఒక వ్యక్తి ఏఐ ప్రోద్బలంతో రాణిపై దాడికి కుట్ర పన్నగా, బెల్జియంలో మరొకరు తీవ్రమైన ఆందోళనలతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. 

అమెరికా టీనేజర్లు సైతం ఏఐ వ్యసనానికి గురై తీవ్ర మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రాత్రంతా ఏఐతో చాట్‌లతో నిమగ్నం కావడం వల్ల నిద్రలేమితోపాటు ఒంటరితనం ఏర్పడి, మెదడుపై తీవ్ర ప్రభావం పడి సైకోసిస్‌ లక్షణాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సైకోసిస్‌ అనేది ఒక మానసిక రుగ్మత స్థితి. ఇది వైద్యపరంగా అధికారికంగా గుర్తించిన జబ్బు కానప్పటికీ, మానసిక నిపుణులు తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు.

ప్రధాన కారణాలివీ..
» ఏఐ చాట్‌బాట్లు యూజర్ల ఆలోచనలను ఎప్పుడూ సమర్థిస్తూ సమాధానాలు ఇస్తాయి. ఒక వ్యక్తికి తప్పుడు లేదా వింత ఆలోచనలు ఉన్నా, ఏఐ వాటిని నిజమే అని నమ్మించి భ్రమలను పెంచుతుంది.
»   కొన్నిసార్లు ఏఐ తనకు తెలియని విషయాలను కూడా తప్పుడు సమాచారంతో వాస్తవం లాగా సృష్టిస్తుంది. దీనిని నమ్మి యూజర్లు మతిస్థిమితం కోల్పోతారు
» రాత్రంతా ఏఐతో చాటింగ్‌ వల్ల నిద్ర కరువై, మెదడు పనితీరు దెబ్బతింటుంది. సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండటం వల్ల వాస్తవ జ్ఞానం నశిస్తుంది.

వివిధ దేశాల్లో కేసులు...
» 2026లో క్యారెక్టర్‌.ఏఐ, గూగుల్‌ వంటి సంస్థలపై పలు కుటుంబాలు దావాలు వేశాయి. మైనర్‌ పిల్లలు ఏఐ చాట్‌బాట్లను నిజమైన స్నేహితులుగా, ప్రేమికులుగా భావించి, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.
» నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ నివేదిక ప్రకారం కొంతమంది యూజర్లు ఏఐ తమకు ప్రత్యేక శక్తులు ఇచ్చిందని, ప్రపంచాన్ని రక్షించే మిషన్‌ అప్పగించిందని నమ్మడం ప్రారంభించారు.
» ఫాస్ట్‌ కంపెనీ నివేదిక ప్రకారం... వ్యాపార రంగంలో 44% మంది మేనేజర్లు తమ సొంత తెలివితేటల కంటే ఏఐ ఇచ్చే సలహాలనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది ఓ రకమైన సామూహిక ఆధారపడే తత్వానికి దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement