టీనేజర్: మొటిమలు రాకుండా ఏం చేయాలి?
యువతి: డ్రై స్కిన్‌ను ఎలా మెరిపించాలి?
మహిళ: ముడతల నివారణకు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి?
బ్యూటీకి సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏఐ చాట్‌బాట్‌లో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అడిగిన వెంటనే ఎలాంటి సమస్యకైనా ఏఐ ద్వారా ఇట్టే సమాధానమూ లభిస్తుంది. దానిని అమలులో పెట్టినవాళ్లు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో మాత్రం తెలియాల్సి ఉంది. జెనరేటివ్ ఏఐ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో ‘బ్యూటీ’ టార్చర్‌కు గురవుతుందా?!
నిజమిదీ...
ఇటీవల ఆస్టిన్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో క్లెపాక్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ‘బ్యూటీ అథారిటీ’ అనే మ్యాగజీన్‌ను చూసి, చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ మ్యాగజీన్‌లోని అందమైన యువతుల ఫొటోలు చూసి, ఫొటోగ్రాఫర్ల వివరాల కోసం వెతికినప్పుడు ‘ఎఐ’ రూపొందించిన చిత్రాలు అని చిన్న ఫాంట్‌లో ఇచ్చిన లైన్స్ కనిపించాయి. అవి ఏవీ వాస్తవ మహిళల ఫొటోలు కావు. కంటెంట్ కూడా ‘ఏఐ’ ఇచ్చిందే. ఈ సౌందర్య ప్రక్రియలు నిజ జీవిత మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? ఈ ఆలోచన ఆ మహిళా ఫొటోగ్రాఫర్‌ని ఆందోళనకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటే కొద్దిసేపటిలోనే వేలకొద్ది లైక్స్, వ్యూస్ వచ్చాయి. లక్షలాది మంది ఇది ‘అత్యంత ప్రమాదకరం’ అని కామెంట్ల రూపంలో తెలిపారు.
‘చాలా మంది నిజమైన వ్యక్తులను, ముఖ్యంగా తాము ఫొటోజెనిక్ కాదని భావించే మహిళలను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ గా, వారు నిజంగా ఇష్టపడే, తమని తాము గొప్పగా భావించేవారి ఫొటోలు తీయగలగడం నాకు చాలా ఇష్టం. కానీ, ఇది నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది’ అని క్లెపాక్ ఈ వీడియోలో వివరించింది.
‘ఏఐలో ఉన్న మహిళ ఎప్పుడూ తనని తాను అద్దంలో చూసుకోలేదు. కానీ, మనం ప్రతి రోజూ అద్దంలో చూసుకోవాలి..’ అని ఒకరు, ‘మహిళల సౌందర్య ప్రమాణాలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి. వీటివల్ల దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమైన మనుషుల స్థానంలో నకిలీవి రావడం.. వాటిని అనుసరించి మనం మరింత నకిలీగా కనిపించేలా ప్రోత్సహించడం చాలా బాధగా ఉంది’ అని ఒక మోడల్ తెలియజేసింది.
ఏఐతో రెండూ సమస్యలే..
→ ఏదైనా చర్మ సమస్య వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి ఏఐని అడిగితే చికిత్స జనరల్‌గా చెబుతుంది. అంతేకానీ, మన స్కిన్‌టైప్‌ని బట్టి పర్సనలైజ్‌డ్‌గా చెప్పలేదు. దాంతో ఏఐ ఇచ్చిన చికిత్సలను చేస్తే, వికటించే ప్రమాదం ఉంది
→ ఏఐలో సెర్చ్ చేసి సౌందర్య సాధనాల గురించి తెలుసుకుంటూ, వాటిని కొనుగోలు చేస్తున్నారు. వాడుతున్నారు. మన చర్మానికి అవి నప్పితే సరి, లేదంటే రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది
→ గూగుల్‌కి అడ్వాన్స్ ఏఐ... అంతే కానీ అది డాక్టర్ కాదు. ఏదైనా చర్మ సమస్య వస్తే ఫొటో తీసి ఏఐలో అప్‌లోడ్ చేసి, సమస్య ఏంటి అని అడుగుతూ, అదిచ్చే సమాధానంతో ఆందోళన చెందుతున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిమా, సోరియాసిస్.. చర్మ సంబంధిత సమస్యలు ఎన్నో ఉంటాయి. అన్నింటికీ ఒకేలాంటి సమాధానం సరైనది కాదు ∙ఏఐ ఇచ్చిన బ్యూటీ ఫొటోలు చూసి, అవి నిజమే అని వాటిలాగే తామూ ఉంటామని, అవే సూచనలు పాటించడం వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
ఏఐ వల్ల సమాచారం వరకు తెలుసుకోవడం మంచిదే. కానీ, ఏఐ ఇచ్చిన సమాచారం అంతా మనమీదనే ప్రయోగించుకుంటే కోరి సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అనే విషయాన్ని గ్రహించాలంటున్నారు నిపుణులు.
సొంతవైద్యం సరి కాదు..
ఏఐని సమాచారం తెలుసుకోవడానికే ఉపయోగించాలి కానీ, సెల్ఫ్ ట్రీట్‌మెంట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికీ వారి చర్మతత్త్వం ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండే ప్రయోగాలు చేయకూడదు. తెలుసుకోవడం మంచిదే. స్కిన్ రియాక్షన్ అయితే టెన్షన్ పడాల్సింది కూడా మనమే. కొందరు పేషెంట్స్ ఓవర్ నాలెడ్జ్‌తో వస్తారు. ఇటీవల ఒక వ్యక్తి ఆందోళనగా మావద్దకు వచ్చాడు. అతనికి కాలి బొటనవేలి గోరు మీద నల్లటి మచ్చ వచ్చింది. దాని ఫొటో తీసి, ఎఐకి ఇస్తే నెయిల్ క్యాన్సర్ అని వచ్చింది. అతను చాలా ΄్యానిక్ అయ్యాడు. అనుమానం ఉంటే నెయిల్ కట్ చేసి, ల్యాబ్‌కి పంపిస్తాం అని చెప్పాం. ప్రతిదీ ఏఐలో తెలుసుకుంటూ అత్యుత్సాహం చూపుతున్నారు. దీనికి ఈ ట్రీట్‌మెంట్ కాదు కదా! అని మమ్మల్నే ప్రశ్నించేవారూ ఉంటున్నారు. స్కిన్, హెయిర్ కి సంబంధించి ఏఐ ఇచ్చే చిట్కాలు పాటించి, వికటించి మమ్మల్ని సంప్రదించినవారూ ఉన్నారు.
– డాక్టర్ విజయగౌరి బండారు, డెర్మటాలజిస్ట్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


