రాత్రి 10 గంటలు. ఇల్లు నిశ్శబ్దం. ఆమె పక్కన అతను ఉన్నాడు. కానీ లేడు. ఫోన్ వెలుగు అతని ముఖం మీద పడుతుంది. వేళ్లు స్క్రోల్ చేస్తున్నాయి. రీల్స్... యూట్యూబ్.. ఫేస్‌బుక్... మాటలు లేవు. కళ్లలోకి చూడటం లేదు. స్పర్శ లేదు. వాళ్లకు విడాకులు జరగలేదు. వాళ్లు విడిపోలేదు. కాని కలిసి మాత్రం లేరు. అతని ఫోన్ వాళ్లను విడగొట్టింది. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ‘ఫబ్బింగ్’. ఫోన్‌లో పడి భార్యను నిర్లక్ష్యం ( Snubbing ) చేయడమే ఫబ్బింగ్. నేడు కనిపిస్తున్న అనేక దుష్ఫలితాలకు ఈ స్థితి కూడా ఒక కారణం.
రాత్రి పదిగంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ మంచం మీద ఆమె పక్కనే అతను ఉన్నాడు.. కానీ లేడు! చేతిలోని స్మార్ట్‌ఫోన్ వెలుతురు అతని ముఖం మీద పడుతోంది. వేళ్లు యాంత్రికంగా స్క్రోల్ చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ రీల్స్ శబ్దాలు వస్తున్నాయి కానీ, ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు. కళ్లలోకి చూసుకునే తీరిక లేదు. కనీసం చిన్న స్పర్శ కూడా లేదు. వాళ్లకు విడాకులు కాలేదు, వాళ్లు విడిపోలేదు.. కానీ కలిసి మాత్రం లేరు!
అతని చేతిలోని ఆ ఐదు అంగుళాల ఫోన్ స్క్రీన్, వాళ్ల మధ్య హిమాలయాలంత దూరాన్ని పెంచేసింది. ఆధునిక సమాజం ఈ నిశ్శబ్ద విషాదానికి పెట్టిన కొత్త పేరే.. ‘ఫబ్బింగ్’. ఫోన్‌ను, స్నబింగ్ ను కలిపి తయారు చేసిన పదం. దీని అర్థం ఫోను ద్వారా చేసే మానసిక హింస.
ఒకప్పుడు ఆఫీస్ నుండి వచ్చే భర్త కోసం భార్య గేట్ దగ్గర ఎదురుచూసేది. ఇప్పుడు అతను వచ్చినా గేట్ తెరుచుకున్న చప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే అతను భౌతికంగా ఇంట్లోకి వచ్చినా, అప్పటికే డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీటింగ్‌లు, మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లు, యూట్యూబ్, రీల్స్‌తో కాలం కరిగిపోతోంది. భార్య ఏదైనా మాట్లాడబోతే ‘ఒక నిమిషం’ అనే సమాధానం వస్తుంది. కానీ ఆ ఒక్క నిమిషం ఎప్పటికీ రాదు. అతను శరీరంతో ఇంట్లోనే ఉంటాడు, కానీ మనసుతో వేరే ప్రపంచంలో ఉంటాడు. ఇది శారీరక దూరం కాదు, అంతకుమించిన మానసిక మరణం. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పుడు ప్రతి మూడవ ఇంట్లో జరుగుతున్న నిరంతర కృత్యం.
కనిపించని గోడ
మొదట ‘ఆఫీస్ వర్క్ ఉంది’ అని మొదలవుతుంది. తర్వాత ‘ఫ్రెండ్స్ గ్రూప్‌లో చాటింగ్’ అంటారు. చివరకు ఆమె ఏదైనా చెప్పాలంటే అతణ్ణి గట్టిగా తట్టి పిలవాల్సిన పరిస్థితి. అతను చెవులకున్న హెడ్‌ఫోన్స్ తీసి ‘ఏంటి?’ అని విసుక్కుంటాడు. ప్రేమగా మాట్లాడుకోవడానికి, కలిసి నవ్వడానికి, ఆఖరికి మనస్ఫూర్తిగా గొడవ పడటానికి కూడా అక్కడ సమయం లేదు. ఆమెకు అర్థం కావడం లేదు.. గొడవ పడాలా? లేక ఏడవాలా? ఎందుకంటే ఎదుటివాడు ఏ తప్పూ చేయలేదు, కేవలం ‘బిజీ’గా ఉన్నాడు. కానీ ఆ బిజీ అనే ముసుగు వెనుక ఆమె మనసు మెల్ల మెల్లగా చచ్చిపోతోంది.
పేరు లేని ఒంటరితనం
భర్త తన పక్కనే ఉన్నా తనకు అందుబాటులో లేకపోవడం భార్యకు ఎంత బాధ? సినిమాకు వెళ్లాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పిల్లాడి ఫీజు కట్టాలన్నా ఆమె ఒంటరిగానే పోరాడాలి. ఇంట్లో ఇద్దరూ ఉంటారు, కానీ సంసార భారాన్ని ఆమె ఒక్కతే మోస్తుంది. స్నేహితులు ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి, భర్త బంగారం’ అంటుంటే ఆమె గుండెల్లో ఏడుస్తూ పైకి నవ్వుతుంది. ఎందుకంటే ‘నా భర్త ఫోన్ తో లవ్‌లో ఉన్నాడు’ అని సమాజానికి ఎలా చెప్పుకుంటుంది? ఈ ఒంటరితనానికి చట్టబద్ధమైన పేరు లేదు, విడాకుల సర్టిఫికేట్ లేదు.. అందుకే ఇది ఇంకాస్త ఎక్కువగా బాధిస్తుంది.
పరిష్కారం ఎక్కడ?
ఈ డిజిటల్ చెరసాల నుంచి బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నియమాలు అవసరం
→ భర్తతో గొడవ పడకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టి ‘నువ్వు చెడ్డవాడివి కాదు, కానీ నీ పక్కన ఉంటూనే నేను ఒంటరిగా నలిగిపోతున్నాను’ అని అర్థమయ్యేలా చెప్పాలి
→ ఇంట్లో ‘డిజిటల్ డిన్నర్’ రూల్ పెట్టాలి. రాత్రి భోజన సమయంలో రోజుకు కనీసం 30 నిమిషాలు ఫోన్ లను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోవాలి
→ ‘బెడ్‌రూమ్ నో ఫోన్ జోన్’. పడుకునే గదిలోకి ఫోన్ ను రానివ్వకూడదు
→ ఆమె కూడా అతని ఫోన్ అలవాటుతో విసిగిపోయి తను కూడా ఫోన్ కు బానిస అవ్వకూడదు. తనకంటూ ఒక ప్రపంచాన్ని, హాబీలను, స్నేహితులను పెంచుకోవాలి.
సాంకేతికత శత్రువు కాదు, దాన్ని మనం బంధాలను విడగొట్టడానికి వాడుతున్నామా లేదా కలపడానికి వాడుతున్నామా అనేదే ముఖ్యం. ఫోన్ స్క్రీన్ వల్ల వస్తున్న దూరాన్ని ఇప్పుడే గుర్తించి తగ్గించుకోకపోతే, ఒకరోజు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటూనే.. మానసిక విడాకులు తీసుకున్న ‘డైవోర్సీలు’గా మిగిలిపోతారు. హెచ్చరిస్తున్న ఈ డిజిటల్ కాలాన్ని ఇప్పుడైనా గమనిద్దాం.. బంధాలను కాపాడుకుందాం.


