ఫోన్‌ చూడొద్దంటే.. ప్రాణాలు తీశాడు | Incident in Karnataka | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చూడొద్దంటే.. ప్రాణాలు తీశాడు

Jun 8 2026 5:13 AM | Updated on Jun 8 2026 5:13 AM

Incident in Karnataka

వెంకటనాయుడు కుటుంబం (ఫైల్‌)

మందలించిన అక్క, తండ్రిని కత్తితో కడ తేర్చిన కొడుకు 

అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో విచక్షణారహితంగా దాడి  

ఆపై ఆత్మహత్యాయత్నం చేసుకున్న కిరాతకుడు  

కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో దురాగతం

సాక్షి, బళ్లారి: ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ చూడొద్దు అని ఓ తండ్రి కొడుక్కి చెప్పడమే తప్పు అయింది. ఫోన్‌లో గేమ్స్‌ ఆడడం మాని బుద్ధిగా చదువుకో అని ఓ అక్క తమ్ముడికి చెప్పడమే మరణశాసనం అయింది. ఫోన్‌ చూడొద్దని చెప్పిన తండ్రి, అక్కపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన దారుణ ఉదంతం కర్ణాటకలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామంలో వ్యవసాయపనులు చేసుకునే రైతు వెంకట నాయుడు (48)కు కూతురు ప్రగతి(20), కొడుకు సాయి వెంకట్‌ మణిదీప్‌ (18)ఉన్నారు. వెంకటనాయుడు కుటుంబం తెలుగువారు. 

గొడవగా మొదలై రక్తపాతంగా మారి.. 
రాత్రి పొద్దుపోయే వరకూ మణిదీప్‌ మొబైల్‌లో గేమ్స్‌ ఆడుతుండగా అక్క ప్రగతి మొబైల్‌ పక్కనపెట్టి చదువుకోవాలని అతనికి సూచించింది. దీంతో మణిదీప్‌ ఆమెతో గొడవకు దిగాడు. అంతటితో ఆగని అతడు కోపోద్రిక్తుడై వంటగదిలో కత్తి తీసుకుని అక్క ప్రగతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు విన్న తండ్రి వెంకటనాయుడు వచ్చి కొడుకును అడ్డుకోబోయాడు. అయితే తండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కత్తితో పొడిచాడు. తరువాత తాను కూడా పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రగతి అక్కడే మరణించింది.

తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ స్థానికులు తొలుత గంగావతి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. తల్లి సౌజన్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం తల్లీ కుమారుడు ఒకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం కొప్పళ జిల్లా ఎస్పీ రామ్‌ అరసిద్ధి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రీ, కుమార్తె మృతితో అయోధ్య గ్రామంలో విషాదం నెలకొంది. మొబైల్‌ఫోన్లు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ యువతపై ఏమేర దు్రష్పభావం చూపుతున్నాయో ఈ ఘటనే అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement