మెడ వణుకుతోంది… కనీసం ఫోన్‌ను పట్టుకోలేకపోతున్నా! | The Rise of Phone Body: How Digital Habits Are Affecting Physical Health | Sakshi
Sakshi News home page

మెడ వణుకుతోంది… కనీసం ఫోన్‌ను పట్టుకోలేకపోతున్నా!

Jul 2 2026 11:02 AM | Updated on Jul 2 2026 11:16 AM

The Rise of Phone Body: How Digital Habits Are Affecting Physical Health

ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్‌ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్‌పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్‌పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్‌ బాడీ (Phone Body)”. అంటే..

ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.

అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్‌లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.

👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్‌ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్‌(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.

👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్‌పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్‌కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

  • 20–20–20 రూల్

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • మెడ పోశ్చర్‌పై దృష్టి

ఫోన్‌ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్‌లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

  • స్క్రీన్ టైమ్ పరిమితి

రోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.

  • శారీరక కదలికలు తప్పనిసరి

ప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.

  • గ్రిప్ & చేతి వ్యాయామాలు

బంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.

  • బయట గడిపే సమయం పెంచాలి

సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.

  • డిజిటల్ డీటాక్స్ అలవాటు

వారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement