ప్రశాంత మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావం క్రమంగా బలపడుతోంది. 2026 చివరి నాటికి ఇది అత్యంత శక్తివంతమైన వాతావరణ పరిణామంగా మారే అవకాశం 90 శాతానికి పైగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలుల మార్పులు ఈ పరిణామానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) తాజా అంచనాల ప్రకారం.. తూర్పు పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితలంతో పాటు లోతుల్లోనూ వేడి నీరు విస్తరించడం ఎల్ నినో బలపడేందుకు మరింత దోహదం చేస్తోంది.
ప్రపంచ వాతావరణంపై ప్రభావం
ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే పసిఫిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్‌లో వర్షపాతం పెరుగుతుండగా.. ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కరువులు, తుపాన్లపై ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చరిత్రలో అత్యంత ఘోరమైందిగా!
ప్రస్తుత అంచనాల ప్రకారం గనుక ఎల్ నినో పరిణామం కొనసాగితే.. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో ఘటనల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. కొన్ని వాతావరణ నమూనాల ప్రకారం.. ఇది గతంలో నమోదైన తీవ్ర ఎల్‌నినో పరిణామాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం ఎలా?
ఎల్ నినో బలపడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రతి ప్రాంతంపై ప్రభావం ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర పరిస్థితుల ఆధారంగా ప్రభావం మారవచ్చని పేర్కొంటున్నారు. భారత్‌పై రుతుపవనాల తీవ్రతను బట్టి ఈ ప్రభావం కొనసాగనుందని చెబుతున్నారు.
శాస్త్రవేత్తల నిఘా
ప్రశాంత మహాసముద్రంలోని పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌లో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో తీవ్రతను బట్టి రాబోయే నెలల్లో వర్షాలు, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులపై స్పష్టత రానుంది.


