breaking news
Elnino effect
-
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్ ఎల్‌నినో.. గాడ్జిల్లా ఎల్‌నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావంఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?ఎల్ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్హౌస్ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?ఎల్ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?ఎల్ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
గాడ్జిల్లా ఎల్ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి?
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బలమైన ఎల్ నినో భారత్‌లో వర్షాలను తగ్గిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందని తేల్చేశారు. మరి ఎల్ నినో ఉన్నా ఈ మేఘాలు, వర్షాలు ఎందుకు వస్తున్నాయి?ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత రుతుపవనాల విషయంలో ఎల్ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రతిరోజు వాతావరణాన్ని నియంత్రించదు. ఒక వారం లేదా కొన్ని రోజుల వర్షాలను ఆపే శక్తి దీనికి ఉండదు. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం ఎలా ఉండొచ్చనే అంచనాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.స్థానిక వాతావరణ పరిస్థితులే కారణంప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటానికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్‌నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది.మళ్లీ పుంజుకున్న రుతుపవనాలుఇటీవల కొంతకాలం ఉత్తర దిశగా వెళ్లిన రుతుపవన ద్రోణి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. బంగాళాఖాతం నుంచి తేమ సరఫరా పెరగడంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం ఎంత?భారత వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్ IOD ఉన్నప్పుడు భారత్‌వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నప్పటికీ పాజిటివ్ IOD భారత్‌ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సహకారం అందడం లేదు.మరి వర్షాల లోటు ముగిసినట్టేనా?ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నా.. రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల వర్షాలు మొత్తం సీజన్ పరిస్థితిని నిర్ణయించవు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకం. -
ఎల్ నినో దెబ్బ.. గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్!
వానాకాలంలోనూ ఎండల సెగ తగ్గడం లేదు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పడిపోకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో.. విద్యుత్ వినియోగం భారీగా పెరిగి మీటర్లు రయ్ రయ్ అంటూ పరుగులు పెడుతున్నాయి. దీంతో జీరో బిల్లు పొందుతున్న గృహజ్యోతి లబ్ధిదారులకు ఊహించని షాక్ తగులుతోంది.గృహజ్యోతి పథకం(Telangana Gruha Jyothi Scheme) కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుంది. అయితే పెరిగిన కరెంట్ వినియోగంతో పలువురు లబ్ధిదారులు ఈ పరిమితిని దాటుతున్నారు. ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తగ్గడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, నీటి మోటార్లను ఎక్కువ సమయం నడపాల్సి వస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేని కుటుంబాలు.. ఒక్కసారిగా పూర్తి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలోనే సుమారు 4 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు పథక ప్రయోజనానికి దూరమయ్యారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. జూన్‌లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. వీరికి ప్రభుత్వం రూ.99.18 కోట్ల సబ్సిడీని భరించింది.మార్చి నుంచి జూన్ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 6.49 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,355 కోట్ల సబ్సిడీని అందించింది. అయితే వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో జీరో బిల్లు పొందే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇక ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. గత మూడు నెలల్లో 5,384 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇందులో ఒక్క జూన్ నెలలోనే 1,612.270 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం దాదాపు 70 శాతం పెరగడం గమనార్హం.ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం ఇదే స్థాయిలో కొనసాగితే.. జూలైలోనూ 200 యూనిట్ల పరిమితిని దాటే కుటుంబాల సంఖ్య పెరిగి, మరింత మంది గృహజ్యోతి ప్రయోజనానికి దూరమయ్యే అవకాశం ఉంది. -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్‌లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే నెలల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (NOAA) హెచ్చరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో'గా మారవచ్చని తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ పరిణామం భారత్‌లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని నినో Niño-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్ నినో దశలో ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉందని NOAA పేర్కొంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని NOAA అంచనా వేస్తోంది.ఈసారి ఎల్ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ (IITM) శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ వివరించారు. తూర్పు పసిఫిక్‌లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్‌లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకారం.. గతంలో నమోదైన బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో 60 శాతం సందర్భాల్లో సాధారణం కంటే తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం సీజన్లో కూడా దీర్ఘకాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణలో జులై రెండో వారంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, కోస్తా జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.అయితే ఎల్ నినో అంటే కేవలం వర్షాభావమే కాదు. సముద్రాల వేడి పెరగడం వల్ల గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంటే, మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వాతావరణం మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ప్రపంచం చూసింది. 2015-16లో నమోదైన 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రపంచవ్యాప్తంగా వాతావరణ రికార్డులను బద్దలు కొట్టింది. భారత్‌లో 2014, 2015 సంవత్సరాలు ఈ శతాబ్దంలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంవత్సరాలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే స్థాయిలో తీవ్రత పెరిగితే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, ఆహారధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.NOAA అంచనా ప్రకారం ప్రస్తుత ఎల్ నినో 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97 శాతం ఉంది. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టంతా పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిణామాలపైనే నిలిచింది. -
ఎల్ నినో పంజా.. రుతుపవనాల పరుగుకు బ్రేక్!
దేశవ్యాప్తంగా వర్షాల లోటును పూడ్చుతూ వరుసగా తొమ్మిది రోజుల పాటు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. రుతుపవనాలు మళ్లీ బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల జోరుకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై మధ్యలో వర్షాలకు విరామం రావచ్చన్న అంచనాలు ఇటీవలే ఖరీఫ్ పంటలు వేసిన రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.జూన్‌లో దాదాపు మూడు వారాల పాటు రుతుపవనాలు మందగించడంతో దేశంలో వర్షపాతం లోటు తీవ్రంగా పెరిగింది. అయితే జూలై ప్రారంభం నుంచి వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, బంగాళాఖాతం నుంచి వచ్చిన తేమ గాలుల కారణంగా రుతుపవనాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో పశ్చిమ, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.ఈ వర్షాలతో దేశ సీజనల్ వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సాధారణం కంటే 14.3 శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. రుతుపవనాల వర్షపాతం సాధారణ స్థాయికి చేరినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాలు సూచిస్తున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం, నేలలో తేమ మెరుగుపడటం, ఖరీఫ్ సాగు వేగం పుంజుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. అయితే ఈ ఊపు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మళ్లీ వర్షాలకు బ్రేక్?జూలై 10 నుంచి 15 మధ్య ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడటం, మేఘాల విస్తరణ తగ్గడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ వర్ష విరామం కారణంగా జూలై మధ్య నాటికి దేశ మొత్తం వర్షపాతం మళ్లీ లోటు స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా ఇటీవల వరి, ఇతర వర్షాధార ఖరీఫ్ పంటలు వేసిన ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గితే మొలక దశలో ఉన్న పంటలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణలో పెరగనున్న ఎండల తీవ్రతమరోవైపు వర్షాల విరామ ప్రభావంతో తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూలై 10 నుంచి 15 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావమేనా?సాధారణంగా ఎల్‌నినో పరిస్థితులు భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఒకేసారి భారీ వర్షాలు కురిసిన తర్వాత.. ఎక్కువ కాలం వర్ష విరామాలు ఏర్పడే ధోరణి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే రుతుపవనాలు మొత్తం సీజన్లో సమానంగా విస్తరించకుండా.. భారీ వర్షాలు, పొడి కాలాల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడుతుంది.ఇటీవల వర్షాలతో దేశ నీటి పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ.. రుతుపవనాల గమనం ఇంకా అనిశ్చితంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై చివరి వారంలో మరోసారి వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అప్పటి వరకు రైతులు ఆకాశం వైపే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 9 రోజుల వర్షాలతో ఊపిరి పీల్చుకున్న భారత్‌కు.. ఇప్పుడు మరో వర్ష విరామం పరీక్షగా మారనుంది. ఎల్‌నినో ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లో తేలనుంది. -
ఎల్నీనో ముప్పు.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
సాక్షి,హైదరాబాద్: ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైతాంగం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, నీటి లభ్యతకు అనుగుణమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.రైతులు భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేస్తున్న వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే మార్గదర్శకాలనే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎల్నీనో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ&పరిశ్రమల శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ ఎన్ సి రమేష్ బాబు, వ్యవసాయశాఖా కార్యదర్శి సురేంద్ర మోహన్‌లు సమీక్షలో పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వార వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా వారీ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షించి, వాటికి అనుగుణంగానే పంటల ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, గ్రామసభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు విస్తృతంగా వివరించాలని సూచించారు.వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి శాస్త్రీయ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో శాస్త్రవేత్తల సిఫారసుల ఆధారంగా రైతులకు స్పష్టమైన సలహాలు అందించాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో ఉన్న వాస్తవ నీటి నిల్వలపై రైతులకు పారదర్శక సమాచారం అందించి, నీటి లభ్యతకు అనుగుణంగానే సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి సహా గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను సమర్థవంతంగా నింపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్నీనో సవాళ్లను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. -
కష్టకాలంలో కూరగాయల సాగు వ్యూహాలు!
ఎల్‌నినో వల్ల ఏర్పడిన అనిశ్చిత వర్షపాత పరిస్థితులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయ పంటల సాగులో రైతులు కొన్ని ముఖ్యమైన మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయి. మరికొన్నిప్రాంతాల్లో ‘తొలి కరువు’ నెలకొంది. ఇతరప్రాంతాల్లో మొదట్లో వర్షాలు కురిసినా తర్వాత ‘మధ్యకాలపు కరువు’ ఏర్పడింది.ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఎటువంటి ఏయే పంటలు పండించాలి? ఏయే రకాలను ఎంచుకోవాలి? ఎలాంటి మెళకువలు పాటించాలి? ఇటువంటి విషయాలను, మెళకువలను శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి ఈ ప్రత్యేక వ్యాసంలో వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఈ సూచనలు ఉపకరిస్తాయి.జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు వానాకాలం (ఖరీఫ్) పంటలు విత్తే కాలం. మరొక వారం రోజులు మాత్రమే విత్తే కాలం మిగిలి ఉంది. ఆరుద్ర కార్తె వెళ్లి, పునర్వసు కార్తె వచ్చింది. ఇప్పటికీ 60–75 మి.మీ. వర్షం కూడా కురవనిప్రాంతాల్లో ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయని గుర్తించాలి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే రెండు, మూడు వర్షాలు పడి భూమిలో తేమ సరిపోను ఉంది. అయితే, వర్షాల మధ్య 15–20 రోజుల విరామం వచ్చింది. కాబట్టి, ఆయాప్రాంతాలు ఇప్పటికే ‘తొలి కరువు’ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లే అర్థం.తొలి దశలో వర్షాలు పడినప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తుకొని ఉంటారు. మొలకవచ్చిన తర్వాత 15–20 రోజులు మళ్లీ వర్షం పడకపోతే ఆ పరిస్థితిని ‘మధ్యకాలపు కరువు’గా గుర్తించాలి. తొలి దశలో వర్షపాతం ఆధారంగా సాగు చేసిన పంటల్లో మొలక బాగా వచ్చినా, తర్వాత నెలకొన్న మధ్యకాలపు కరువు వల్ల మొక్కలు నీటి ఎద్దడికి గురవుతాయి. విత్తినా అసలు మొలకలే రాకపోతే మళ్లీ విత్తనాలు వేయాలి. కానీ, కచ్చితంగా నేలలో దున్నే పదును ఉన్నప్పుడే విత్తుకోవాలి. 1. వర్షాలు ఆలస్యమైనప్పుడు సాగు వ్యూహాలుస్వల్పకాలిక, కరువును తట్టుకునే కూరగాయ పంటలకు వెళ్లండి. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో ఇక్కడ పేర్కొన్న అనువైన రకాలను సాగు చేసుకోవాలి.టొమోటో: అర్కా వికాస్, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, సాహూ, బాహూ, వీఎన్ఆర్ 3348, వీఎన్ఆర్ 3348, ఆదియా, ఆర్య ఎఫ్1. వంగ: శ్యామల, భాగ్యమతి, పూస క్రాంతి, అర్క నీలకంఠ, మంజరి, ఉత్కర్ష, వినాయక్మిరప: తేజ, ఎల్సీఏ–334, అర్కా లోహిత్, ఐఐహెచ్ఆర్ ఎస్ఇఎల్ 132, వీఎన్ఆర్ 978, ఉజాలా ఎఫ్1.బెండ: అర్కా నిఖితా, అర్క నామిక, వర్షా ఉపార్, హిసార్ ఉన్నత్, ఖాసీ లలిమా, వివాన్, వీబీహెచ్–11 (వీఎన్ఆర్), బ్రిగేడియర్, గౌరీ మునగ: పీకేఎం–1, పీకేఎం–2, కోకన్ రుచిరాచిక్కుడు: ఆర్ఎన్డీ–01, అర్కా జే గోరుచిక్కుడు: పూసా నవబహార్ బొబ్బర: అర్కా గరిమ, పూసా, కోమల్, తెలంగాణ కూర బొబ్బర తీగ జాతులు: సొర/ఆనప– అర్కా బహార్, కాకర– అర్కా హరిత్, బీర– అర్కా సుజాత్, దోసకాయ, వంట పుచ్చకాయ పాలకూర: ఆల్ గ్రీన్, అర్కా అనుపమ ∙తేమ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక రకాలు, హైబ్రిడ్లను సాగు చేయాలి.కరువును తట్టుకునే శక్తిని మెరుగుపరచడానికి, తేమ ఒత్తిడి పరిస్థితుల్లో పంట మనుగడను పొడిగించడానికి అంటుకట్టిన టొమాటో, వంగ నారుమొక్కలు నాటుకోవటం మంచిది. దశలవారీగా నర్సరీలను పెంచాలి.2. తొలి కరువు పరిస్థితుల్లో సాగు వ్యూహాలు∙నేలలో తేమను కాపాడటానికి, కలుపును అరికట్టడానికి, నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సేంద్రియ ఆచ్ఛాదనగా ఎండుగడ్డి లేదా ఇతర పంట అవశేషాలను హెక్టారుకు 7–10 టన్నుల చొప్పున వేసుకోండి. ∙నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి మాగిన పశువుల ఎరువు హెక్టారుకు 15 టన్నులు లేదా వర్మీకంపోస్ట్ 10 టన్నుల చొప్పున నేలలో కలపండి. ∙నీటి వినియోగ సామర్థ్యం, నీటి పారుదల, వేర్ల అభివృద్ధిని మెరుగుపరచడానికి ఎత్తు మడుల (గట్టు–కాలువ లేదా వెడల్పాటి ఎత్తు మడుల)పై పంటల సాగు పద్ధతులను అవలంబించండి.పంట పెరుగుదలలోని కీలక దశల్లో, ముఖ్యంగా చురుకైన శాఖీయ పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో ప్రాణరక్షక నీటి తడులు అందించండి. నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పుడు, నీటి వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచడానికి ఒక కాలువ విడిచి ఒక కాలువ పద్ధతిలో నీటిపారుదల చేయండి.తేమ, పోషకాల కోసం మొక్కల మధ్య పోటీని తగ్గించడానికి, ముఖ్యంగా తొలి పెరుగుదల దశల్లో పంట పొలాన్ని కలుపు లేకుండా శుభ్రంగా ఉంచండి.నేలలోని తేమ నష్టాన్ని తగ్గించడానికి, లోతైన నేల తేమ నిల్వలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, దున్నే పనులను నేల పైభాగంలోని 5 సెం.మీ. పొర మట్టి వరకే పరిమితం చేయండి.పంట నాటిన 30 రోజుల తర్వాత,ప్రారంభ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఒత్తిడి పరిస్థితుల్లో మొక్క బలంగా ఉండేలా చేయడానికి, నీటిలో కరిగే ఎరువును (19:19:19 ఎన్పీకే) లీటరు నీటికి 5–7 గ్రాముల చొప్పున రెండుసార్లు ఆకులపై పిచికారీ చేయండి.చీడపీడల నుంచి రక్షణ వ్యూహాలుకరువు పరిస్థితుల్లో తెల్లదోమ, పేనుబంక, నల్లి వంటి రసం పీల్చే పురుగులు తరచుగా కూరగాయల ఉత్పత్తికి ప్రధాన ఆటంకాలుగా మారతాయి. పొడి వాతావరణంలో చాలా శిలీంధ్ర, బాక్టీరియా వ్యాధుల ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాహకాలైన ఈ రసం పీల్చే పురుగుల కార్యకలాపాలు పెరగడం వల్ల వైరస్ వ్యాధులు ప్రబలవచ్చు. తెగుళ్లు, వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడానికి, పంట నష్టాలను తగ్గించడానికి, సకాలంలో పర్యవేక్షణ, మొక్కల రక్షణకు తగిన చర్యలు తీసుకోవండి. సిఫారసు చేసిన సమీకృత తెగులు, వ్యాధి నిర్వహణ పద్ధతులను అనుసరించండి.విత్తన శుద్ధి: రసం పీల్చే పురుగుల నుండి ముందస్తు రక్షణ కల్పించడానికి, విత్తనాలకు ఇమిడాక్లోప్రిడోర్ థియామెథాక్సామ్ను కిలో విత్తనానికి 3–5 గ్రాముల చొప్పున చల్లండి.రసం పీల్చే పురుగుల నివారణకు:- ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్: 0.5 మి.లీ/లీటరు నీటిలో- థియామెథోక్సామ్ 25 డబ్ల్యూజి: 0.35 గ్రా/లీటరు నీటిలో- థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సి: 0.65 మి.లీ/లీటరు నీటిలో.నల్లి నివారణకు..- అబామెక్టిన్ 1.9% ఈసీ: 0.5 మి.లీ/లీటరు- స్పైరోమెసిఫెన్ ః 1.0 మి.లీ/లీటరు- క్లోర్ఫెనాపైర్: 1.0 మి.లీ/లీటరు- ప్రోపార్గైట్: 2–3 మి.లీ/లీటరు,- ఫెనాజాక్విన్ 1.9% ఈసీ: 2.5 మి.లీ/లీటరు.వృక్ష, జీవ నియంత్రణకు..- వేప ఆధారిత పురుగుమందులు: 5 మి.లీ/లీటరు నీటిలో- రసం పీల్చే పురుగులపై జీవ నియంత్రణ కారకంగా వెర్టిసిలియం లెకాని: 5 గ్రా/లీటరు నీటిలోపిండి నల్లి నివారణకు..- స్పైరోటెట్రామాట్ 0.5 మి.లీ/లీటరు నీటిలో, లేదా ఇమిడాక్లోప్రిడ్: 0.5 మి.లీ/లీటరు నీటి నిర్వహణలెపిడోప్టెరాన్ గొంగళి పురుగుల నిర్వహణ..- ఇండోక్సాకార్బ్: 0.5 మి.లీ/లీ- ఎమామెక్టిన్ బెంజోయేట్: 0.35 గ్రా/లీ- ఫ్లూబెండియామైడ్: 0.5 మి.లీ/లీ3. ‘మధ్యకాలపు కరువు’ ఉత్పత్తి వ్యూహాలుఅధిక వర్షపాతం సమయంలో నీటి పారుదలని మెరుగుపరచడానికి మరియు నీరు నిలిచిపోవడాన్ని తగ్గించడానికి, గట్లు–కాలువల పద్ధతిలో నాటటం (25–30 సెం.మీ. ఎత్తు గట్లు) లేదా కాలువల ద్వారా నీరు పెట్టేందుకు వీలుగా ఎత్తయిన మడుల(90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు)పై పంటలు వేసుకోండి ∙తేమ కొరత ఏర్పడినప్పుడల్లా, ముఖ్యంగా పంట చురుకైన పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో, కీలకమైన పంట పెరుగుదల దశల్లో రక్షక నీటి తడులను అందించండి ∙తేమ, పోషకాలు, సూర్యరశ్మి కోసం పోటీని తగ్గించడానికి, పంట పెరుగుదల తొలి దశల్లో పొలాల్లో కలుపు లేకుండా చూసుకోండి.– డాక్టర్ దండా రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ, ఉద్యాన విశ్వవిద్యాలయంనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఐఐఎంఆర్‌లో చిరుధాన్య విత్తనాలు
ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?
ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ఈ ఖరీఫ్ కాలంలో పంటలను, రైతులను ఎక్కువగానే ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని, వర్ష΄ాతం తక్కువగా ఉంటుందని భారతీయ వాతావరణ విభాగం తాజా అంచనాలు చెబుతున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావటం, వర్షాల మధ్య 15–25 రోజుల పొడి విరామం, తర్వాత భారీ వర్షాలు రావచ్చు. అందువల్ల రైతులకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. ఈ వాతావరణ సంక్షోభ పరిస్థితుల్లో సీ3 పంటలకన్నా సీ4 పంటలపై ఆధారపడటమే మేలని సుస్థిర/ప్రకృతి వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో ఏమిటో ఎలాగో తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న పంట మొక్కల్లో 85–95% సీ3 పంటే. వరి, గోధుమ, సోయాబీన్స్, కంది, పత్తి, బంగాళదుంపలు, కూరగాయలు వంటి ప్రధాన ఆహార పంటలు ఈ కోవకే చెందుతాయి. నీటి ఎద్దడిని, అధిక ఉష్ణోగ్రతను ఇవి అంతగా తట్టుకోలేవు. కరువు పరిస్థితుల్లో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ సీ4 పంటలు మెరుగైన ఫలితాలనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న, చెరకుతో ΄ాటు జొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యపు పంటలు సీ4 కోవలోకి వస్తాయి.సీ4 పంటల ప్రత్యేకత ఏమిటి?పంటలు, మొక్కలు, చెట్ల ఆకులు గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటాం. కార్బన్ డయాక్సైడ్ను 3 కర్బన సమ్మేళనంగా (కాల్విన్ చక్రాన్ని ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ3 పంటలు అంటాం. అందువల్ల ఇవి చల్లని, తేమతో కూడిన వాతావరణాలకు అనువైనవి. కార్బన్ డయాక్సైడ్ను 4 కర్బన సమ్మేళనంగా (క్రాంజ్ అనాటమీ అనే ప్రత్యేక నిర్మాణ అనుసరణను ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ4 పంటలు అంటాం. ఇవి వేడి, పొడి, ఉష్ణమండల వాతావరణాల్లో సమర్థవంతంగా పెరగడానికి అనువైనవి.పత్రరంధ్రాలు కీలకం!వేడి పెరగటం, తేమ అధికం కావటం, వర్ష΄ాతంలో మార్పులు మొక్కలో శరీరధర్మ, జీవరసాయన మార్పులు తెస్తాయి. అప్పుడు బయటకు కనిపించే లక్షణాలు ఇవి.. ఆకులు వాలిపోవటం, పూత రాలిపోవటం, వేర్లు కుళ్లిపోవటం, దిగుబడి తగ్గటం.పత్ర రంధ్రాలు మొక్క ‘శ్వాస ద్వారాలు’. సీ3 పంటలు 30 డి.సె.ల నుంచి 35 డి.సె.లు దాటితే నీరు కోల్పోతున్నామనే సంకేతంతో శ్వాస ద్వారాలు మూసుకుపోతాయి. కార్బన్ డయాక్సైడ్ లోపలికి రాకపోతే కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. ఫలితంగా ఆహార పదార్థాల తయారీ ఆగిపోతుంది. అప్పుడు మొక్క తన కాండాన్ని కా΄ాడుకోవటానికి ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి తనలో నిల్వ ఉన్న శక్తినే వాడుకుంటుంది. సీ4 మొక్కల్లో అయితే 35–40 డి.సె.ల ఉష్ణోగ్రత వరకు కిరణజన్య సంయోగక్రియ అత్యధికంగా జరుగుతుంది. 45 డి.సె.ల తర్వాత మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది.సీ3 + సీ4 పంటలు కలిపి వేసుకోవాలిఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగినప్పుడు కూడా సీ4 పంటల్లో కిరణజన్య సంయోగక్రియ తార స్థాయిలో జరుగుతుంది. కాబట్టి, సీ4 మొక్కలు వేడి ఒత్తిడికి గురికావు. అందువల్ల సీ4 పంటలు అధిక వేడి ఒత్తిడిలో కూడా దిగుబడులను ఇవ్వగలవు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా, వర్షాలు తక్కువగా ఉండబోతున్న ఈ సంవత్సరం రైతులు సీ4 ప్రధాన పంటలుగా సాగు చేసుకోవటం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దిగుబడి నష్టం రాకుండా చూసుకోవచ్చు.అయితే, సీ3 పంటలు సాగు చేసే రైతులు కూడా సీ4 పంటలను అనుబంధ పంటలుగా, జీవవైవిధ్య పంటలుగా, సరిహద్దు పంటలుగా వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సీ3 పంటలపై ఎల్‌నినో ఒత్తిడిని తగ్గించటానికి సీ4 పంటలు దోహదం చేస్తాయని అంటున్నారు. తమ నేల రకం, నీటి వసతి తదితర అంశాలపై ఆధారపడి స్థానిక వ్యవసాయ నిపుణులను సంప్రదించి రైతులు తమ పంటల ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది.జీవామృతం ఎంతవరకూ రక్షిస్తుంది? వేడి ఒత్తిడి నుంచి పంటలను రక్షించుకోవటానికి ద్రవ జీవామృతం వంటి జీవ ఉత్ప్రేరకాలు పంటలపై చల్లాలి. వీటిలోని సూక్ష్మజీవులు, మొక్క కణజాలంలో అంతరజీవులు కూడా ఆర్ఓఎస్ (రియాక్టివ్ ఆక్సిజెన్ స్పీసీస్) ప్రభావం నుంచి రక్షించేందుకు అవే ఎంజైములను ఉత్పత్తి చేసి పంటలను రక్షిస్తాయి.ఒకవేళ వేడి ఒత్తిడి ఆగలేదంటే పంట ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి, మొదట ఆబ్సిసిక్ ఆమ్లం ఉత్పత్తి చేసి పత్ర రంధ్రాలను మూసివేస్తుంది. తర్వాత ఇథిలిన్ ఉత్పత్తి చేసి పూత, పిందెలు, ఆకులు, కొమ్మలు పండి రాలిపోయేలా చేస్తుంది.ప్రధాన పంటలను అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షించాలంటే.. ప్రధాన పంట కంటే ఎత్తుగా పెరిగే అనుబంధ పంటలు, జీవవైవిధ్య పంటలను ఎంపిక చేసుకోవాలి. అంటే, ప్రధాన పంట పక్కనే సంవత్సరం పొడవునా ఉండేలా కంది, మునగ, ఆముదం మొదలైన పంటలు ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా కొంత నీడ, తేమ లభించటం ద్వారా పంట పొలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.ఆచ్ఛాదనతో మేలుపత్ర రంధ్రాలు ఆకుల కింది భాగంలో ఉంటాయి. కాబట్టి నేలపై ఆచ్ఛాదన చేయకపోతే, సూర్యుని వేడి కాంతి కిరణాలు నేరుగా నేలను తాకి ఆకు కింద భాగంపై పరావర్తనం చెందుతాయి. దీని ఫలితంగా పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి, నేలను కప్పి ఉంచే మంద΄ాటి పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన చేస్తే పత్ర రంధ్రాలు తెరిచి ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
రాబోయేది ఆషామాషీ ఎల్ నినో కాదు!
ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్‌నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగితే భారత్ సహా ప్రపంచానికి ‘ట్రిపుల్ షాక్’ తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసాధారణ వాతావరణ మార్పులు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.తాజాగా విడుదలైన నార్త్ అమెరికన్ మల్టీ-మోడల్ ఎన్సెంబుల్ (NMME) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని నమూనాల్లో ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటవచ్చని సూచిస్తున్నాయి.వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో(మానిటరింగ్ జోన్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.5 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే దాన్ని ‘బలమైన ఎల్‌నినో’గా పరిగణిస్తారు. 2 డిగ్రీలకుపైగా పెరిగితే ‘సూపర్ ఎల్‌నినో’గా వర్గీకరిస్తారు. తాజా అంచనాల ప్రకారం 2026 చివరినాటికి ఈ స్థాయిని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇది ఇంకా ప్రారంభ అంచనాల దశలోనే ఉన్నందున తుది ఫలితంగా పరిగణించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ వాతావరణ నమూనాలు ఎల్ నినో బలపడే సంకేతాలను చూపుతుండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.ఎల్‌నినో ప్రభావం వల్ల భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రసరణ విధానాలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సముద్ర ఉష్ణ తరంగాలు, పగడపు దిబ్బల నాశనం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే భారత్‌కు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.చరిత్రను పరిశీలిస్తే బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వడగాల్పులు తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులు తరచుగా కనిపించాయి. దీంతో వ్యవసాయం, తాగునీటి వనరులు, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్తవ్యస్తత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు పెరగవచ్చు. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ట్రిపుల్ షాక్.. ఎల్ నినో బలపడితే ఒకేసారి మూడు పెద్ద స్థాయిలో ప్రభావాలు రావచ్చని సూచన:రుతుపవనాలు బలహీనపడే అవకాశంవర్షాభావం / కరువు పరిస్థితులువడగాల్పులు పెరగడంకొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు/వరదలుగ్లోబల్ టెంపరేచర్లు పెరగడంసముద్ర ఉష్ణతరంగాలుపగడపు దిబ్బల (coral reefs) నష్టంకార్చిచ్చులు పెరగడం (ఆస్ట్రేలియా/ఆగ్నేయాసియా)ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ.. దానికి ఎల్‌నినో ప్రభావం తోడైతే 2027 వరకూ ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
ఎల్‌నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్‌నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్‌నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్‌నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్‌లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్‌గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్‌నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఎల్‌నినో.. తాగునీళ్లకూ నో!
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ముంచుకురావడంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2026 జూన్ నుంచి 2027 జనవరి వరకు ఎల్‌నినో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్, జూలైలో వర్షాలు కురవకపోతే తీవ్ర కరువు పరిస్థితులు ఉత్పన్నమై ఆగస్టు నాటికి తాగునీటి కష్టాలు ముదిరిపోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా కురిసే వర్షాలు కూడా వచ్చే వానాకాలం సీజన్లో ఆలస్యమైతే రానున్న నెలల్లో తాగునీటికి కటకటలాడాల్సిందేనని నీటిపారుదల శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అడుగంటిన జలాశయాలు: తెలుగు రాష్ట్రాలకు జీవధార అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఇప్పటికే అడుగంటిపోగా, ఇతర జలాశయాల్లో సైతం అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. జంట నగరాలకు తాగునీటితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగు, సాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39 టీఎంసీల నిల్వలే మిగిలి ఉన్నాయి. నాగార్జునసాగర్ నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలైతే ప్రస్తుతం 158.5 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. సాగర్‌లో కనీసం 128.299 టీఎంసీల నిల్వలుంటే తాగునీటికి పంపింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. 29.92 టీఎంసీల సామర్థ్యమున్న సింగూరు ప్రాజెక్టులో 6.15 టీఎంసీలే ఉన్నాయి. 80.5 టీఎంసీల శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో సైతం 22 టీఎంసీలే మిగిలాయి. 20.18 టీఎంసీలకు గాను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 9.19 టీఎంసీలే మిగిలాయి. వచ్చే ఏడాది జనవరి వరకు ఎల్‌నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని, లేనిపక్షంలో హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలకు తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14న జరగనున్న కృష్ణాబోర్డు సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించాలని కోరుతున్నారు. -
మేఘసందేశం = ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : ‘నైరుతి’ నిస్తేజంతో దిగాలుపడుతున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ నిపుణులు తీపి కబురు అందించారు. ప్రపంచ వాతావరణంపై ప్రత్యేకించి మన దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రతికూల ప్రభా వం చూపుతున్న ఎల్ నినో స్థితి క్రమంగా బలహీనపడుతోందని తాజా అధ్యయనంలో తేల్చారు. ఇది ఒకటి, రెండు నెలల్లో తటస్థ స్థితికి చేరుకుంటుందని, దీని ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తు తం నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నెలకొంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులకు ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం, నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు తరలిపోవడమే కారణం. నైరుతి రుతుపవనాల ఆగమనం, విస్తరణకు అనేక సందర్భాల్లో అడ్డుగా నిలిచేది ఎల్‌నినో అనేది తెలిసిందే. అదిప్పుడు బలహీన పడుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాధారణంగా దక్షిణాదివైపు రావాల్సిన నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోయింది. ఆ రుతుపవన ద్రోణి ఇప్పుడు తిరిగి దక్షిణాది ప్రాంతంపైకి త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధి కారి రాజారావు తెలిపారు. ఎల్‌నినో క్రమంగా బలహీన పడుతుండటంతో మున్ముందు మంచి వర్షాలు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు. రుతుపవనాలపై దాని ప్రభావం పూర్తిగా తొలగిపోకున్నా క్రమంగా ఆ ప్రభావం తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఎల్‌నినో క్షీణించినా మంచి వర్షాలు పడుతాయని కచ్చితంగా చెప్పలేమని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఎల్‌నినో అంటే? పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎల్ నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినా వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలïßహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్ నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూన్, జూలైలలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలాలు అడుగంటి వర్షాభావంతో విలవిలలాడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఎల్ నినో, లా నినాలతో సంబంధం లేకుండానే మంచి వర్షాలు కురిసిన సందర్బాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి విశ్లేషించారు. అయితే లా నినో ఏర్పడిన ఎక్కువ సందర్బాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని సందర్భాల్లో అధికంగా కూడా వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. ఎల్ నినో బలంగా ఉంటే వర్షాలు కురవవని అనుకోవడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు. దారితప్పిన నైరుతి రుతుపవన ద్రోణి... ఎల్ నినోకు తోడు ఈసారి నైరుతి రుతుపవన ద్రోణి మనల్ని ముంచింది. రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోవడం ప్రస్తుత పరిస్థితికి మరో కారణంగా వాతావరణ కేంద్రం చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక నైరుతి రుతుపవన ద్రోణి ఏర్పడుతుంది. ఇది నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలో రాజస్తాన్‌లోని గంగానగర్ నుంచి అలహాబాద్ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు ఏర్పడుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితి నుంచి గాలుల దిశను బట్టి కిందనున్న దక్షిణం వైపునకు రావాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి అలా కాకుండా అది సాధారణ స్థితి నుంచి పైకి అంటే ఉత్తరం వైపు నుంచి హిమాలయాలవైపు వెళ్లి పోయింది. రుతుపవనాలు ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటాయి. అవెప్పుడు ఎలా మారుతాయో వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. అవి దిశ మార్చుకోవడానికి గాలుల తీవ్రతే కారణమని, దానివల్ల ఈసారి రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు వెళ్లిపోయిందని రాజారావు అంటున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాభావం నెలకొంది. ఒక్కోసారి అది దిశ మార్చుకోకుండా సాధారణ స్థితిలోనే ఉంటే అప్పుడు ఉత్తరం వైపునకు, దక్షిణం వైపునకు కాకుండా అక్కడే తటస్థంగా ఉండిపోతుంది. అప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఒకేవిధంగా భారీ వర్షాలు కురుస్తాయి. కానీ అదిప్పుడు హిమాలయాలవైపు వెళ్లిపోవడంతో మనకు వర్షాలు తక్కువగా కురిశాయని రాజారావు తెలిపారు. అయితే రుతుపవనాలు దక్షిణాది వైపు రావడం తప్పనిసరిగా జరిగే పరిణామమేనని, కానీ అవెప్పుడు వస్తాయో సాధారణంగా చెప్పలేమన్నారు. కానీ ఈసారి ఈ నెల చివరి నాటికి వస్తాయని అంచనా వేశామన్నారు. ఎల్ నినో ప్రభావం ఎంతో, దానికంటే ఎక్కువగా నైరుతి రుతుపవన ద్రోణి దిశ మార్చుకోవడం వల్ల కూడా వర్షాభావం ఏర్పడిందని అంటున్నారు. ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాలు... దేశంలో ఈ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా సంవత్సరాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే పడాల్సిన దానికన్నా కనిష్టంగా 14 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతానికి, ఎల్ నినోకు దగ్గరి సంబంధం ఉందని పలు శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి. వాతావరణశాఖ దేశం మొత్తాన్ని 36 సబ్ డివిజన్లుగా విభజించింది. 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ మొత్తం డివిజన్లలో 25 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఎల్ నినో ప్రభావం వల్ల 2002, 2009లలో 36 సబ్ డివిజన్లలో 20కి పైగా ప్రాంతాల్లో లోటు వర్షపాతం, క్షామ పరిస్థితులు తలెత్తాయి. ఎల్ నినో ఏర్పడిన ఏడాది దేశమంతా సాధారణ వర్షాలు పడి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధ్వాన పరిస్థితులు నెలకొన్న ఉదాహరణలూ ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. -
ఈసారీ లోటు వర్షపాతమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణ వర్షమే.. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ఎగువ నిండకుంటే.. దిగువ కన్నీరే!
ఎగువన కర్ణాటకలోని రిజర్వాయర్లన్నీ ఖాళీ అవి నిండితేనే దిగువన జూరాల, శ్రీశైలం, సాగర్లకు నీరు పరిస్థితిని సమీక్షించిన సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన తాగునీటి అవసరాలకు 80 టీఎంసీల నిల్వ చేశాకే ఖరీఫ్‌కు నీరు! ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తప్పని కటకట? హైదరాబాద్: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. జలకళను కోల్పోయి నిర్జీవంగా మారడం రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత ఉండటం.. మరోవైపు ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడతాయన్న అంచనాల నేపథ్యంలో రాష్ర్ట వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే వాటి కింద ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనమే. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు అవసరాలపై సమీక్షించిన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సైతం ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాలను తీర్చేలా కనీసం 80 టీఎంసీల నీరు వచ్చేంత వరకు ఖరీఫ్‌కు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోరాదని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. అన్నీ ఖాళీయే.. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. గోదావరి ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎక్కడా ఖరీఫ్ సరిగా సాగలేదు. కృష్ణా పరిధిలో నీటి లభ్యత ఉన్నా విద్యుదుత్పత్తికి వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో మూడు ప్రాజెక్టుల పరిధిలోని మొత్తం నీటి నిల్వ 539.80టీఎంసీలకు గాను 175.25 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 204.59 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఈసారి మరో 30టీఎంసీలు తగ్గిపోయింది. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో వర్షాలు సకాలంలో కురిసినా.. అక్కడి ప్రాజెక్టులు నిండి దిగువన మన ప్రాజెక్టులకు నీరు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. వర్షాలు సరిగా కురవకుంటే దిగువన మనకు మిగిలేది కన్నీరే. ఎల్‌నినో ఎఫెక్ట్.. ఇప్పటికే రిజర్వాయర్లన్నీ ఖాళీకావడానికి తోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండే అవకాశముందన్న హెచ్చరికలు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో నీటి పరిస్థితి, ఖరీఫ్ అవసరాలపై సమీక్షించిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ సమావేశం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఒక్కో చోట భారీగా వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అసలే పడవని.. అదే జరిగితే ప్రాజెక్టుల్లో నీరు చేరడం గగనమేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఖరీఫ్ ఆయకట్టును ముందస్తుగా నిర్ణయించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమిస్తూ.. ఎస్సారెస్పీలో 15 టీఎంసీలు, శ్రీశైలంలో 15, సాగర్‌లో 50టీఎంసీల మేర నీటి లభ్యత వచ్చాకే ఖరీఫ్ ప్రణాళికను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే సాగర్ కింద 6.3లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష, ఎస్సారెస్పీ కింద మరో లక్ష ఎకరాలకు నీటి కటకట తప్పదు. -
ఖరీఫ్ కలవరం
ఖరీఫ్ సీజన్ రైతులను కలవర పెడుతోంది. సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా.. తొలకరి జిల్లాను ఇంకా పలకరించలేదు. మరోవైపు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఇప్పటికే దుక్కులు దున్ని.. నార్లు పోసిన రైతులు సాగు చేపట్టేందుకు పెట్టుబడుల కోసం బ్యాంకుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే.. కొత్తవాటికి మోక్షమని వారి ఆశలపై బ్యాంకర్లు నీళ్లు చల్లుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుండడం రైతులను ఆనందపరుస్తున్నా.. ఎప్పుడు అమలు చేస్తారో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక అన్నదాత అయోమయంలో పడ్డాడు. -కరీంనగర్ అగ్రికల్చర్ తొంగిచూడని వరుణుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా వరుణుడు జిల్లావైపు తొంగిచూడడం లేదు. వడగాలుల ఉధృతి కూడా ఇంకా తగ్గడం లేదు. ఉరుములు, మెరుపులతో చినుకులు వస్తున్నా.. క్షణాల్లోనే మాయమైపోతున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు కాగా.. శనివారం వరకు 20 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది ఈ పాటికే రెండుసార్లు భారీ వర్షాలు కురిశాయి. ఈసారి కూడా వర్షాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కొన్నిచోట్ల నార్లు పోస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడు జిల్లాలో 6,42,819 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది గతేడాదితో పోల్చితే 81,764 హెక్టార్లు అదనం. ఈసారి రైతులు అధికంగా పత్తి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి 2.70 లక్షల హెక్టార్లలో, వరి 2.15 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 70 వేల హెక్టార్లలో సాగు కానున్నాయి. మిగిలిన హెక్టార్లలో ఇతర పంటలు వేయనున్నారు. లక్షలాది మంది నిరీక్షణ ఏటా ఆరు లక్షల మందికిపైగా రైతులు పంట రుణాలపైనే ఆధారపడి సాగుకు ఉపక్రమిస్తారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. రెండు వేల కోట్ల రుణ లక్ష్యానికి రూ.1805.49 కోట్లు అందించారు. ఇందులో జూన్ ఒకటి నుంచి 2014 మే 31 వరకు రూ.1513.82 కోట్లను రూ.లక్షలోపు రుణాలు ఇచ్చారు. వాటిని ప్రభుత్వం మాఫీ చేస్తే 4,77,663 మందికి లబ్ధి చేకూరనుంది. తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2300 కోట్ల పంట రుణాలిచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఖరీఫ్‌లో రూ.1650 కోట్లు, రబీలో రూ.650 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 40 శాతం రుణాలు అందించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు రుణాల జారీ మొదలే కాలేదు. లక్ష్యం భారీగా ఉన్నా.. బ్యాంకర్లు పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలోని ఏడు లక్షల మంది రైతులకు పూర్తిగా రుణాలు ఇవ్వాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం సర్కారు ఉత్తర్వులు వచ్చి.. పాత రుణాలను మాఫీ చేసి.. కొత్త రుణాలు ఇచ్చేసరికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది. అంటే డిసెంబర్ వరకు రుణాలు అందే వీలులేదు. వ్యవసాయ రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ వర్తించాలంటే జూలై 20లోపే రుణాలు మంజూరు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సర్కారు ఉత్తర్వులతో రుణాల మంజూరు చేసేసరికే ఆ గడువు కాస్తా ముగిసే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. ప్రభుత్వం తొందరగా స్పందించి షరతుల్లేకుండా రుణ మాఫీ అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -కరీంనగర్ అగ్రికల్చర్ వెంటాడుతున్న ‘ఎల్‌నినో’ ఎల్‌నినో భయం జిల్లా రైతులను వణికిస్తోంది. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల మేరకు అకాలవర్షాలు తప్ప అనుకూల వర్షాలు పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. జూలై వరకు వర్షాలరాక ఆలస్యమైతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో మంచి వర్షాలు కురిస్తే సాగు కష్టాల నుంచి గట్టెక్కే ఆస్కారముంది. అయితే ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉండకపోవచ్చని, వర్షాలు సమృద్ధిగా పడతాయని జేడీఏ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల కోసం తిప్పలు రైతులు సాగు పనులు మొదలు పెట్టాలంటే ముందుగా కావాల్సింది పెట్టుబడి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటేనే ఖరీఫ్ సాగు ముందుకు కదులుతుంది. రుణం కోసం రైతులు బ్యాంకుల గడప తొక్కితే పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటున్నారు. రుణమాఫీపై సర్కారు నుంచి ఆదేశాలు రాకపోవడంతో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. సాగుకు ఇప్పటినుంచి పదిరోజులే కీలకం. వర్షాలు పడకముందే రైతులు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. చినుకుపడగానే.. దుక్కులు దున్నేందుకు.. విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్లు, కూలీలు అవసరమవుతారు. ఇందుకు చేతిలో తప్పనిసరిగా నగదు ఉంచుకోవాల్సిందే. మరోవైపు మాఫీ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందో..? కొత్త రుణాలు ఎప్పుడిస్తారో..? అనే భయం అన్నదాతల్లో నెలకొంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే రైతుల నడ్డి విరగడం ఖాయం. ఫలితంగా అన్నదాతల్లో తీవ్ర మనోవేదన వ్యక్తమవుతోంది.


