ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్‌నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం కొన్ని నెలలపాటు కొనసాగితే భారత్ సహా ప్రపంచానికి ‘ట్రిపుల్ షాక్’ తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసాధారణ వాతావరణ మార్పులు వరుసగా ఎదురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజాగా విడుదలైన నార్త్ అమెరికన్ మల్టీ-మోడల్ ఎన్‌సెంబుల్ (NMME) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సాధారణ స్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని నమూనాల్లో ఈ వ్యత్యాసం 5 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటవచ్చని సూచిస్తున్నాయి.
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో(మానిటరింగ్ జోన్) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1.5 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే దాన్ని ‘బలమైన ఎల్‌నినో’గా పరిగణిస్తారు. 2 డిగ్రీలకుపైగా పెరిగితే ‘సూపర్ ఎల్‌నినో’గా వర్గీకరిస్తారు. తాజా అంచనాల ప్రకారం 2026 చివరినాటికి ఈ స్థాయిని దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇది ఇంకా ప్రారంభ అంచనాల దశలోనే ఉన్నందున తుది ఫలితంగా పరిగణించలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వివిధ వాతావరణ నమూనాలు ఎల్ నినో బలపడే సంకేతాలను చూపుతుండటంతో శాస్త్రవేత్తలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రసరణ విధానాలు మారిపోతాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సముద్ర ఉష్ణ తరంగాలు, పగడపు దిబ్బల నాశనం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే భారత్‌కు ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.
చరిత్రను పరిశీలిస్తే బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, వడగాల్పులు తీవ్రరూపం దాల్చడం వంటి పరిస్థితులు తరచుగా కనిపించాయి. దీంతో వ్యవసాయం, తాగునీటి వనరులు, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అస్తవ్యస్తత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు పెరగవచ్చు. దక్షిణ అమెరికా పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది.
ట్రిపుల్ షాక్.. ఎల్ నినో బలపడితే ఒకేసారి మూడు పెద్ద స్థాయిలో ప్రభావాలు రావచ్చని సూచన:
రుతుపవనాలు బలహీనపడే అవకాశం
వర్షాభావం / కరువు పరిస్థితులు
వడగాల్పులు పెరగడం
కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో భారీ వర్షాలు/వరదలు
గ్లోబల్ టెంపరేచర్లు పెరగడం
సముద్ర ఉష్ణతరంగాలు
పగడపు దిబ్బల (coral reefs) నష్టం
కార్చిచ్చులు పెరగడం (ఆస్ట్రేలియా/ఆగ్నేయాసియా)
ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా భూమి అసాధారణ వేడిని ఎదుర్కొంటున్న వేళ.. దానికి ఎల్‌నినో ప్రభావం తోడైతే 2027 వరకూ ప్రపంచం మరింత తీవ్రమైన వాతావరణ అస్తవ్యస్తతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


