source: X
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సాధించిన అత్యల్ప పతకాల సంఖ్య ఇదే. అయితే గ్లాస్గో గేమ్స్‌లో భారత్ ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
పరిమితుల కారణంగా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో కేవలం 10 క్రీడలనే నిర్వహించారు. భారత్‌కు సంప్రదాయంగా భారీగా పతకాలు అందించే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడలు ఈసారి పోటీల్లో లేకపోవడం భారత పతకాల అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది.
2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఐదు క్రీడల నుంచే భారత్ 30 పతకాలు (13 స్వర్ణాలు) సాధించింది. అంటే గతసారి భారత్ సాధించిన మొత్తం పతకాలలో దాదాపు సగం ఈ క్రీడల నుంచే వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనూ భారత్ గ్లాస్గోలో 39 పతకాలు సాధించడం గమనార్హం.
బాక్సింగ్‌లో చారిత్రాత్మక ప్రదర్శన
భారత బాక్సర్లు ఈసారి అద్భుతంగా రాణించారు. మొత్తం 10 పతకాలు సాధించగా, అందులో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన బాక్సింగ్ బృందం సాధించిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలిచింది.
జూడోలో కొత్త చరిత్ర
జూడోలోనూ భారత్ సత్తా చాటింది. హర్ష్ సింగ్, అస్మితా డే తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించి, కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాలను అందించారు. యామిని మౌర్య రజతం, ఉన్నతి శర్మ కాంస్యం సాధించారు.
అథ్లెటిక్స్‌లోనూ మెరుపులు
అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజత పతకం సాధించాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్లలో రజతం, 5,000 మీటర్లలో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.
తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో కాంస్యం సాధించి ఈ ఈవెంట్‌లో భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకాన్ని అందించాడు.
వెయిట్‌లిఫ్టింగ్, పారా-స్పోర్ట్స్‌లోనూ సత్తా
వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి అరుదైన ఘనత అందుకుంది. భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం మొత్తంగా 8 పతకాలు సాధించింది.
పారా-అథ్లెటిక్స్‌లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. ఈ విభాగంలో 7 పతకాలు వచ్చాయి. శర్మిలా ధంకర్, దిలీప్ మహదు గవిత్, సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు.
నాలుగో స్థానంలో భారత్
మొత్తంగా ఈసారి కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. టాప్-3లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా ఉన్నాయి. భారత్, ఆతిథ్య స్కాట్లాండ్ చెరో 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ ఎక్కువ రజతాలు సాధించడంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
సంఖ్యాపరంగా 39 పతకాలు భారత్‌కు 1998 తర్వాత అత్యల్పమే అయినప్పటికీ, సంప్రదాయ పతకాల వనరులైన ఐదు క్రీడలు లేకుండానే ఈ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం గ్లాస్గో గేమ్స్‌లో భారత బృందం సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, పారా-స్పోర్ట్స్‌లో వచ్చిన పురోగతి భారత బహుళ క్రీడా సామర్థ్యానికి కొత్త ఆశలు కలిగిస్తోంది.


