ఇక ఈ అధ్యాయం ముగిసిపోయింది | Outgoing India fielding coach Dilip Emotional farewell note Goes Viral | Sakshi
Sakshi News home page

ఇక ఈ అధ్యాయం ముగిసిపోయింది.. ఈ ఐదేళ్ల ప్రయాణం చిరస్మరణీయం

Aug 3 2026 3:21 PM | Updated on Aug 3 2026 3:30 PM

Outgoing India fielding coach Dilip Emotional farewell note Goes Viral

PC: Instagram

టీమిండియాతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు సాధించిన తిరుగులేని విజయాల్లో తానూ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ అధ్యాయం ముగిసిపోయిందని.. ఏదేమైనా గత ఐదేళ్లు తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయని పేర్కొన్నాడు.

కాగా 2021, నవంబరులో టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన టి.దిలీప్‌ (T. Dilip).. తన హయాంలో మంచి మార్పులు తీసుకువచ్చాడు. మైదానంలో అత్యుత్తమంగా రాణించిన ఫీల్డర్లకు గుర్తింపుగా డ్రెసింగ్‌రూమ్‌లో ఫీల్డింగ్‌ మెడల్‌ ప్రదానం చేయడం మొదలుపెట్టాడు ఈ హైదరాబాదీ.

అయితే, బీసీసీఐ మాత్రం అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో దిలీప్‌ స్థానంలో కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌గా శుభదీప్‌ ఘోష్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో దిలీప్‌ తాజాగా టీమిండియాతో తన అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.

అదే లక్ష్యంతో పనిచేశాను
‘‘ఈ ఐదేళ్ల ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. సహాయక సిబ్బందిలో చేరే ముందే.. జట్టు కోసం నా సర్వస్వం ఇవ్వాలని భావించాను. మొదటి రోజు నుంచి అదే లక్ష్యంతో పనిచేశాను.

ఫీల్డింగ్‌ కోచ్‌గా జట్టుతో ప్రయాణం చేయడం పట్ల నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఫీల్డింగ్‌ మెడల్‌ అనేది మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మెడల్‌ ప్రదానం ద్వారా డ్రెసింగ్‌రూమ్‌లో ఒక ఆహ్లాదకర వాతావరణం సృష్టించాము.

చిరస్మరణీయ విజయాలు
ఈ జ్ఞాపకాలు నా మదిలో నిలిచిపోతాయి. రెండు టీ20 ప్రపంచకప్‌ (2024,2026), ఒక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (2025), రెండు ఆసియా కప్‌ (2023, 2025) ట్రోఫీలు గెలిచిన జట్టులో నేనూ భాగమే.

ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌, వన్డే వరల్డ్‌కప్‌ (2023) ఫైనల్‌ చేరిన జట్టులోనూ నేను ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సదా కృతజ్ఞుడినై ఉంటాను.

మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలో
నాపై నమ్మకం ఉంచినందుకు రాహుల్‌ ద్రవిడ్‌, గౌతం గంభీర్‌కు నా ధన్యవాదాలు. మీ ఇద్దరితో కలిసి పని చేయడం గొప్ప అనుభవం. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌.. మీరు కెప్టెన్లుగా ఉన్న సమయంలో భారత క్రికెట్‌కు నా వంతు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను.

ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతీ ఆటగాడు, కోచ్‌, సహాయక సిబ్బందిలోని ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడిక ఈ అధ్యాయం ముగిసిపోయింది. ఈ ఐదేళ్లు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. అయితే, నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’’ అని టి. దిలీప్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: బుమ్రా అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement