ఎల్‌నినో ఎఫెక్ట్‌: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..? | El Nino fears: Only a miracle can save the worst monsoon record | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ఎఫెక్ట్‌: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?

May 30 2026 9:10 AM | Updated on May 30 2026 11:08 AM

El Nino fears: Only a miracle can save the worst monsoon record

రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్‌లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్‌ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.

ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్‌ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్‌నినో అనేది.. పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్‌ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్‌నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్‌నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్‌లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.

ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్‌ (IOD) కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్‌గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్‌నినో ప్రభావం నేరుగా మాన్సూన్‌పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.

ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్‌ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్‌ కోర్‌ జోన్‌లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.

👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement