India weather forecast
-
ఎల్‌నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్‌నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్‌నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్‌నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్‌లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్‌గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్‌నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్‌నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నిజంగానే వచ్చేస్తున్నాయా?
ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ. మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్‌కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.భారత మాన్సూన్ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్‌ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్‌కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది. ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్‌లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి. -
నిప్పుల కొలిమి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బందాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. యూపీతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 నగరాల్లో 19 మన దేశంలోనివే కావడం గమనార్హం. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్లో యూపీ, హరియాణా, జార్ఖండ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణానికి మించి వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.వీటితోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులుంటాయని హెచ్చరించారు. మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్–20 జాబితాలో యూపీలోని బందా, బిహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నగరాలు న్నాయి. ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వీటితోపాటు బిహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్లతోపాటు యూపీ, పశ్చిమ బెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. టాప్–20 నగరాల్లో మనదేశంలో లేని ఏకైక నగరం నేపాల్‌లోని లుంబిని మాత్రమే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా భోపాల్‌లో ‘నైట్ హీట్ వేవ్’(రాత్రిపూట వడగాల్పులు) హెచ్చరికలు జారీ అయ్యాయి. -
ఎక్కడెక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి?
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం అన్ని ప్రాంతాల వారికి దక్కడం లేదు. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్రాల్లో వర్షాల వల్ల వరదలు కూడా సంభవిస్తున్నాయని వింటున్నాం. కానీ ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమవుతున్నాయి. దేశంలో రుతుపవనాలు ఆదిలో మంద గమనంతో కదిలినప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికీ సాధారణ వర్షపాతంలో 9 శాతమే లోటని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2015 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త బెటరే. కాని దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆగస్టు నెల వచ్చినప్పటికీ ఇంకా వర్షాలు విస్తరించడం లేదు. గతేడాది వర్షాకాల సీజన్ ముగిసే సెప్టెంబర్ నెల నాటికి సాధారణ వర్షపాతంకన్నా 14 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి సాధారణ వర్షం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. వర్షాలను సూచించే మ్యాప్‌ను పరిశీలించినట్లయితే సంక్లిష్ట పరిస్థితే కనిపిస్తోంది. గుజరాత్‌నే ఉదాహరణగా తీసుకుంటే దక్షిణ గుజరాత్లో సోమవారం కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి ఐదుగురు మరణించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకులు తప్ప పెద్ద వర్షాలే పడలేదు. ఆగస్టు మూడవ తేదీ నాటికి కచ్ ప్రాంతంలో సాధారణ వర్షపాతంకన్నా 72 శాతం లోటు వర్షాలు కురిశాయి. సురేంద్రనగర్, ఆనంద్ ప్రాంతాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. ఈసారి గుజరాత్లో వ్యవసాయం సాగు కూడా తగ్గిపోయింది. ఉత్తర యూపీలో, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటి ప్రాంతంలో సాధారణ వర్షపాతంలో 15 శాతం మాత్రమే ఇంతవరకు వర్షాలు కురిశాయి. కిన్నార్ ప్రాంతంలో 37 శాతం వర్షాలు కురిశాయి. వర్షాధార వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడే హిమాచల్ ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవడం లేదు. పంజాబ్‌లోని సగం ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ వర్షపాతమే నమోదయింది. ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో 77 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. కపూర్తలా ప్రాంతంలో మాత్రం సాధారణంకన్నా 47 శాతం వర్షాలు కురిశాయి. మేఘాలయాలో కూడా తక్కువ వర్షాలే నమోదయ్యాయి. దక్షిణ గరో హిల్స్‌లో దేశంలోకెల్లా అతి తక్కువ వర్షపాతం నమోదయింది. అక్కడ 89 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. మిజోరమ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎంత వర్షపాతం నమోదయిందో తెలియడం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో వర్షాలను నమోదుచేసే ప్రాంతాలు తక్కువగా ఉండడం, ఆయా రాష్ట్రాల అధికారుల వద్ద మ్యాప్‌లు లేకపోవడం వల్ల పరిస్థితి అంచనాలకు అందడం లేదు. దేశంలో ప్రతి ఏటా ఎక్కువ వర్షాలు కురిసినా, తక్కువ వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక జల వనరులు మృగ్యమవడం సాధారణమే. కానీ ఎంతకాలం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. ఎక్కువ, త క్కువ వర్షాల నమోదును విశ్లేషించడం ద్వారా ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.


