ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ.
మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు.
తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్‌కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.
భారత మాన్సూన్‌ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్‌ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది.
ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది.
ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్‌కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది.
ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్‌లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి.


