కష్టకాలంలో కూరగాయల సాగు వ్యూహాలు! | Changes In Crop Yields Due To The Impact Of El Nino Measures Sagubadi | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో కూరగాయల సాగు వ్యూహాలు!

Jul 7 2026 7:49 AM | Updated on Jul 7 2026 7:49 AM

Changes In Crop Yields Due To The Impact Of El Nino Measures Sagubadi

సాగుబడి

ఎల్‌నినో వల్ల ఏర్పడిన అనిశ్చిత వర్షపాత పరిస్థితులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయ పంటల సాగులో రైతులు కొన్ని ముఖ్యమైన మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయి. మరికొన్నిప్రాంతాల్లో ‘తొలి కరువు’ నెలకొంది. ఇతరప్రాంతాల్లో మొదట్లో వర్షాలు కురిసినా తర్వాత ‘మధ్యకాలపు కరువు’ ఏర్పడింది.

ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఎటువంటి ఏయే పంటలు పండించాలి? ఏయే రకాలను ఎంచుకోవాలి? ఎలాంటి మెళకువలు పాటించాలి? ఇటువంటి విషయాలను, మెళకువలను శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ దండా రాజిరెడ్డి ఈ ప్రత్యేక వ్యాసంలో వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఈ సూచనలు ఉపకరిస్తాయి.

జూన్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు వానాకాలం (ఖరీఫ్‌) పంటలు విత్తే కాలం. మరొక వారం రోజులు మాత్రమే విత్తే కాలం మిగిలి ఉంది. ఆరుద్ర కార్తె వెళ్లి, పునర్వసు కార్తె వచ్చింది. ఇప్పటికీ 60–75 మి.మీ. వర్షం కూడా కురవనిప్రాంతాల్లో ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయని గుర్తించాలి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే రెండు, మూడు వర్షాలు పడి భూమిలో తేమ సరిపోను ఉంది. అయితే, వర్షాల మధ్య 15–20 రోజుల విరామం వచ్చింది. కాబట్టి, ఆయాప్రాంతాలు ఇప్పటికే ‘తొలి కరువు’ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లే అర్థం.

తొలి దశలో వర్షాలు పడినప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తుకొని ఉంటారు. మొలకవచ్చిన తర్వాత 15–20 రోజులు మళ్లీ వర్షం పడకపోతే ఆ పరిస్థితిని ‘మధ్యకాలపు కరువు’గా గుర్తించాలి. తొలి దశలో వర్షపాతం ఆధారంగా సాగు చేసిన పంటల్లో మొలక బాగా వచ్చినా, తర్వాత నెలకొన్న మధ్యకాలపు కరువు వల్ల మొక్కలు నీటి ఎద్దడికి గురవుతాయి. విత్తినా అసలు మొలకలే రాకపోతే మళ్లీ విత్తనాలు వేయాలి. కానీ, కచ్చితంగా నేలలో దున్నే పదును ఉన్నప్పుడే విత్తుకోవాలి.  


1. వర్షాలు ఆలస్యమైనప్పుడు సాగు వ్యూహాలు
స్వల్పకాలిక, కరువును తట్టుకునే కూరగాయ పంటలకు వెళ్లండి. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో ఇక్కడ పేర్కొన్న అనువైన రకాలను సాగు చేసుకోవాలి.

టొమోటో: అర్కా వికాస్, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, సాహూ, బాహూ, వీఎన్‌ఆర్‌ 3348, వీఎన్‌ఆర్‌ 3348, ఆదియా, ఆర్య ఎఫ్‌1.    
వంగ: శ్యామల, భాగ్యమతి, పూస క్రాంతి, అర్క నీలకంఠ, మంజరి, ఉత్కర్ష, వినాయక్‌
మిరప: తేజ, ఎల్‌సీఏ–334, అర్కా లోహిత్, ఐఐహెచ్‌ఆర్‌ ఎస్‌ఇఎల్‌ 132, వీఎన్‌ఆర్‌ 978, ఉజాలా ఎఫ్‌1.
బెండ: అర్కా నిఖితా, అర్క నామిక, వర్షా ఉపార్, హిసార్‌ ఉన్నత్, ఖాసీ లలిమా, వివాన్, వీబీహెచ్‌–11 (వీఎన్‌ఆర్‌), బ్రిగేడియర్, గౌరీ    
మునగ: పీకేఎం–1, పీకేఎం–2, కోకన్‌ రుచిరా
చిక్కుడు: ఆర్‌ఎన్‌డీ–01, అర్కా జే    
గోరుచిక్కుడు: పూసా నవబహార్‌    
బొబ్బర: అర్కా గరిమ, పూసా, కోమల్, తెలంగాణ కూర బొబ్బర      
తీగ జాతులు: సొర/ఆనప– అర్కా బహార్, కాకర– అర్కా హరిత్, బీర– అర్కా సుజాత్, దోసకాయ, వంట పుచ్చకాయ    
పాలకూర: ఆల్‌ గ్రీన్, అర్కా అనుపమ ∙తేమ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక రకాలు, హైబ్రిడ్‌లను సాగు చేయాలి.

  • కరువును తట్టుకునే శక్తిని మెరుగుపరచడానికి, తేమ ఒత్తిడి పరిస్థితుల్లో పంట మనుగడను పొడిగించడానికి అంటుకట్టిన టొమాటో, వంగ నారుమొక్కలు నాటుకోవటం మంచిది. దశలవారీగా నర్సరీలను పెంచాలి.

2. తొలి కరువు పరిస్థితుల్లో సాగు వ్యూహాలు
∙నేలలో తేమను కాపాడటానికి, కలుపును అరికట్టడానికి, నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సేంద్రియ ఆచ్ఛాదనగా ఎండుగడ్డి లేదా ఇతర పంట అవశేషాలను హెక్టారుకు 7–10 టన్నుల చొప్పున వేసుకోండి. ∙నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి మాగిన పశువుల ఎరువు హెక్టారుకు 15 టన్నులు లేదా వర్మీకంపోస్ట్‌ 10 టన్నుల చొప్పున నేలలో కలపండి. ∙నీటి వినియోగ సామర్థ్యం, నీటి పారుదల, వేర్ల అభివృద్ధిని మెరుగుపరచడానికి ఎత్తు మడుల (గట్టు–కాలువ లేదా వెడల్పాటి ఎత్తు మడుల)పై పంటల సాగు పద్ధతులను అవలంబించండి.

  • పంట పెరుగుదలలోని కీలక దశల్లో, ముఖ్యంగా చురుకైన శాఖీయ పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో ప్రాణరక్షక నీటి తడులు అందించండి. నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పుడు, నీటి వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచడానికి ఒక కాలువ విడిచి ఒక కాలువ పద్ధతిలో నీటిపారుదల చేయండి.

  • తేమ, పోషకాల కోసం మొక్కల మధ్య పోటీని తగ్గించడానికి, ముఖ్యంగా తొలి పెరుగుదల దశల్లో పంట పొలాన్ని కలుపు లేకుండా శుభ్రంగా ఉంచండి.

  • నేలలోని తేమ నష్టాన్ని తగ్గించడానికి, లోతైన నేల తేమ నిల్వలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, దున్నే పనులను నేల పైభాగంలోని 5 సెం.మీ. పొర మట్టి వరకే పరిమితం చేయండి.

  • పంట నాటిన 30 రోజుల తర్వాత,ప్రారంభ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఒత్తిడి పరిస్థితుల్లో మొక్క బలంగా ఉండేలా చేయడానికి, నీటిలో కరిగే ఎరువును (19:19:19 ఎన్‌పీకే) లీటరు నీటికి 5–7 గ్రాముల చొప్పున రెండుసార్లు ఆకులపై పిచికారీ చేయండి.


చీడపీడల నుంచి రక్షణ వ్యూహాలు
కరువు పరిస్థితుల్లో తెల్లదోమ, పేనుబంక, నల్లి వంటి రసం పీల్చే పురుగులు తరచుగా కూరగాయల ఉత్పత్తికి ప్రధాన ఆటంకాలుగా మారతాయి. పొడి వాతావరణంలో చాలా శిలీంధ్ర, బాక్టీరియా వ్యాధుల ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాహకాలైన ఈ రసం పీల్చే పురుగుల కార్యకలాపాలు పెరగడం వల్ల వైరస్‌ వ్యాధులు ప్రబలవచ్చు. తెగుళ్లు, వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడానికి, పంట నష్టాలను తగ్గించడానికి, సకాలంలో పర్యవేక్షణ, మొక్కల రక్షణకు తగిన చర్యలు తీసుకోవండి. సిఫారసు చేసిన సమీకృత తెగులు, వ్యాధి నిర్వహణ పద్ధతులను అనుసరించండి.

విత్తన శుద్ధి: రసం పీల్చే పురుగుల నుండి ముందస్తు రక్షణ కల్పించడానికి, విత్తనాలకు ఇమిడాక్లోప్రిడోర్‌ థియామెథాక్సామ్‌ను కిలో విత్తనానికి 3–5 గ్రాముల చొప్పున చల్లండి.

రసం పీల్చే పురుగుల నివారణకు:
- ఇమిడాక్లోప్రిడ్‌ 17.8 ఎస్‌ఎల్‌: 0.5 మి.లీ/లీటరు నీటిలో
- థియామెథోక్సామ్‌ 25 డబ్ల్యూజి:  0.35 గ్రా/లీటరు నీటిలో
- థియాక్లోప్రిడ్‌ 21.7 ఎస్‌సి: 0.65 మి.లీ/లీటరు నీటిలో.

నల్లి నివారణకు..
- అబామెక్టిన్‌ 1.9% ఈసీ: 0.5 మి.లీ/లీటరు
- స్పైరోమెసిఫెన్‌ ః 1.0 మి.లీ/లీటరు
- క్లోర్‌ఫెనాపైర్‌: 1.0 మి.లీ/లీటరు
- ప్రోపార్గైట్‌: 2–3 మి.లీ/లీటరు,
- ఫెనాజాక్విన్‌ 1.9% ఈసీ: 2.5 మి.లీ/లీటరు.

వృక్ష, జీవ నియంత్రణకు..
- వేప ఆధారిత పురుగుమందులు: 5 మి.లీ/లీటరు నీటిలో
- రసం పీల్చే పురుగులపై జీవ నియంత్రణ కారకంగా వెర్టిసిలియం లెకాని: 5 గ్రా/లీటరు నీటిలో

పిండి నల్లి నివారణకు..
- స్పైరోటెట్రామాట్‌ 0.5 మి.లీ/లీటరు నీటిలో, లేదా ఇమిడాక్లోప్రిడ్‌: 0.5 మి.లీ/లీటరు నీటి నిర్వహణ

లెపిడోప్టెరాన్‌ గొంగళి పురుగుల నిర్వహణ..
- ఇండోక్సాకార్బ్‌: 0.5 మి.లీ/లీ
- ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌: 0.35 గ్రా/లీ
- ఫ్లూబెండియామైడ్‌: 0.5 మి.లీ/లీ

3. ‘మధ్యకాలపు కరువు’ ఉత్పత్తి వ్యూహాలు
అధిక వర్షపాతం సమయంలో నీటి పారుదలని మెరుగుపరచడానికి మరియు నీరు నిలిచిపోవడాన్ని తగ్గించడానికి, గట్లు–కాలువల పద్ధతిలో నాటటం (25–30 సెం.మీ. ఎత్తు గట్లు) లేదా కాలువల ద్వారా నీరు పెట్టేందుకు వీలుగా ఎత్తయిన మడుల(90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు)పై పంటలు వేసుకోండి ∙తేమ కొరత ఏర్పడినప్పుడల్లా, ముఖ్యంగా పంట చురుకైన పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో, కీలకమైన పంట పెరుగుదల దశల్లో రక్షక నీటి తడులను అందించండి ∙తేమ, పోషకాలు, సూర్యరశ్మి కోసం పోటీని తగ్గించడానికి, పంట పెరుగుదల తొలి దశల్లో పొలాల్లో కలుపు  లేకుండా చూసుకోండి.


– డాక్టర్‌ దండా రాజిరెడ్డి, వైస్‌ ఛాన్సలర్, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ, ఉద్యాన విశ్వవిద్యాలయం

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement